బెట్టింగ్స్‌‌ కోసం రివాల్వర్‌‌‌‌ తాకట్టు..రివకరీ చేసిన గోల్డ్ కూడా తనఖా పెట్టిన అంబర్‌‌‌‌పేట ఎస్ఐ

బెట్టింగ్స్‌‌ కోసం  రివాల్వర్‌‌‌‌ తాకట్టు..రివకరీ చేసిన గోల్డ్ కూడా తనఖా పెట్టిన అంబర్‌‌‌‌పేట ఎస్ఐ
  • రివకరీ చేసిన గోల్డ్​ కూడా తనఖా పెట్టిన అంబర్‌‌‌‌పేట ఎస్‌‌ఐ
  • ఇటీవల ఏపీ గ్రూప్ ​2 పరీక్షలో జాబ్‌‌.. రిలీవ్‌‌ అయ్యేందుకు గన్‌‌ లేకుండా వచ్చి దొరికిండు
  • సస్పెండ్​ చేసిన ఉన్నతాధికారులు
  • అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టాస్క్‌‌ఫోర్స్​ 

అంబర్ పేట, వెలుగు: బెట్టింగ్ ​యాప్స్‌‌‌‌కు బానిసైన అంబర్‌‌‌‌‌‌‌‌పేట ఎస్ఐ చివరకు తన సర్వీస్​ రివాల్వర్‌‌‌‌‌‌‌‌ను కూడా తాకట్టు పెట్టే స్థాయికి దిగజారాడు. ఓ చోరీ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని కూడా కుదువ పెట్టాడు. ఇటీవల ఏపీ​ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్​2 పరీక్షల్లో జాబ్ ​కొట్టిన అతడు.. రిలీవ్​ అయ్యేందుకు గన్​ లేకుండా వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. ఈ సందర్భంగా రివాల్వర్​తో పాటు తాకట్టు పెట్టిన రికవరీ  బంగారం సంగతి కూడా బయటపడింది. దీంతో అతడిని సస్పెండ్​చేసి రివాల్వర్, బంగారం ఎక్కడ పెట్టాలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోని రాయచోటికి చెందిన భాను ప్రకాశ్‌‌‌‌ 2020 బ్యాచ్‌‌‌‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. హబీబ్‌‌‌‌నగర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో పని చేశాడు. ఏడాదిన్నర క్రితం అంబర్‌‌‌‌‌‌‌‌పేట పోలీస్ స్టేషన్​కు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీ సెక్టార్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇంతకుముందు డిటెక్టివ్​ఎస్సైగా ఉన్నప్పుడు ఓ ఇంట్లో పని మనిషి.. దొంగతనం చేసి ఓనర్​కు సంబంధించిన నగలు, డబ్బు ఎత్తుకుపోయాడు. ఆ కేసు విచారించిన భానుప్రకాశ్..​ దొంగను పట్టుకొని 50 గ్రాముల బంగారం రికవరీ చేశాడు. తర్వాత ఈ కేసులో పనిమనిషి, ఓనర్​ లోక్​ అదాలత్‌‌‌‌లో ​కాంప్రమైజ్​అయ్యారు. అయితే, రికవరీ చేసిన బంగారాన్ని మాత్రం ఓనర్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వలేదు. 

బెట్టింగ్​ యాప్స్‌‌‌‌కు బానిసగా మారి..

 భానుప్రకాశ్ ​సరదాగా యాప్స్‌‌‌‌లో బెట్టింగ్​ ఆడడం మొదలుపెట్టాడు. రూ.100, రూ.200, రూ. 500 కాస్తా.. రాను రాను రూ. వేలు, లక్షల్లోకి వెళ్లింది. దీంతో తన జీతంతో పాటు అప్పులు చేసి బెట్టింగ్​యాప్స్‌‌‌‌లో పెట్టడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులు కూడా పోవడంతో బెట్టింగ్‌‌‌‌కు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. దీంతో దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులు కూడా బెట్టింగ్‌‌‌‌లో పోగొట్టుకున్నాడు. ఇలా రూ.70 లక్షల నుంచి రూ. 80 లక్షలు కోల్పోయాడు. 

రివాల్వర్ పోతే పోనియ్ ​అనుకొని..

బెట్టింగ్‌‌‌‌లో డబ్బులు పోయి అప్పుల పాలైన ఎస్సై భానుప్రకాశ్‌‌‌‌కు ఎవ్వరూ ఒక్క రూపాయి ఇవ్వడానికి ముందుకు రాలేదు. దగ్గరి బంధువులు, దూరపు చుట్టాలు, స్నేహితుల దగ్గర వదలకుండా అప్పు చేసిన భానుప్రకాశ్..​తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేకపోవడంతో తట్టుకోలేకపోయాడు. చివరకు తన సర్వీస్​రివాల్వర్​(9 ఎంఎం) ను తనకు తెలిసిన వ్యక్తి దగ్గర కుదువపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. బుల్లెట్స్ ​మాత్రం తీసి భానుప్రకాశ్‌‌‌‌ తన దగ్గరే పెట్టుకున్నాడు.
  
సస్పెన్షన్.. విచారణ 

టాస్క్​ఫోర్స్​ పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన రివాల్వర్‌‌‌‌‌‌‌‌ను తాకట్టు పెట్టినట్టు భానుప్రకాశ్‌‌‌‌ అంగీకరించాడు. దీంతో షాక్‌‌‌‌కు గురైన టాస్క్​ఫోర్స్​పోలీసులు.. బంగారం గురించి ఆరా తీశారు. దాన్ని కూడా తనఖా పెట్టినట్టు చెప్పాడు. దీంతో వారు  ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయగా.. భానుప్రకాశ్‌‌‌‌పై  సస్పెన్షన్ వేటు వేశారు. 

ఏపీ గ్రూప్​2లో జాబ్​కొట్టి...

ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్​2 పరీక్షల్లో భాను ప్రకాశ్​ సత్తా చాటాడు. ఈ ఏడాది ఏప్రిల్​4న వచ్చిన ఇంటర్వ్యూ ఫలితాల్లో అతడి పేరు రావడంతో ఆనందపడ్డాడు. అయితే, రిలీవ్​ కావడానికి వెళ్తే సర్వీస్​ రివాల్వర్ ​వాపస్ ​చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినా ఏదో ఒకటి మేనేజ్‌‌‌‌​చేద్దామనే ఉద్దేశంతో బుల్లెట్స్​ మాత్రం తీసుకువెళ్లాడు. అక్కడున్న అధికారులు రివాల్వర్​ ఏదని ప్రశ్నించగా.. ముందు బుల్లెట్స్​తీసుకోవాలని, తర్వాత రివాల్వర్ ఇస్తానని చెప్పాడు. వారు ఒప్పుకోకపోవడంతో రివాల్వర్ ​తన డెస్క్​లో ఉందని చెప్పాడు. అనుమానం వచ్చిన వారు సీసీ కెమెరాలను పరిశీలించగా, అతడి డెస్క్‌‌‌‌లో నుంచి ఏదో ప్యాకెట్​ తీసుకెళ్తు న్నట్టు కనిపించింది. దాని గురించి ఎంక్వైరీ చేయగా, అది పని మనిషి దగ్గర రికవరీ చేసిన బంగారంగా తేల్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న టాస్క్‌‌ ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు.