సర్వీస్ రివాల్వర్ తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్సై భాను ప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం (జనవరి 10) అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలు లో ఉన్నాడు.
బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొత్తు కాజేసిన ఎస్సై భాను ప్రకాశ్ రెడ్డి.. సర్వీస్ రివాల్వర్ తాకట్టు పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. తన సర్వీస్ రివాల్వర్ ను ఎక్కడో పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేయడంపై విచారణ జరిపిన పోలీసులు.. చివరికి ఎస్సై భాను ప్రకాశ్ ను నిందితునిగా చేస్తూ కేసు నమోదు చేశారు.
ట్రైన్ లో ప్రయాణిస్తున్న సందర్భంలో రివాల్వర్ పోయిందని పోలీసుల విచారణలో స్టేట్మెంట్ ఇచ్చాడు భాను ప్రకాష్. ఎంత వెతికినా గన్ కనిపించలేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఏపీ లో గ్రూప్2 ఉద్యోగం పొందిన భాను ప్రకాష్ .. తెలంగాణలో రిలీవ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు.
బెట్టింగ్ లో రికవరీలో వచ్చిన బంగారంతో పాటు రివాల్వర్ ను తాకట్టు పెట్టిన అంబర్ పేట ఎస్ఐ భాను ప్రకాష్ పై రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రికవరీ చేసిన బంగారం తాకట్టు పెట్టినందుకు ఒక కేసు సర్వీస్ రివాల్వర్ ను తాకట్టు పెట్టినందుకు మరో కేసు నమోదు చేశారు అంబర్ పేట పోలీసులు .
బెట్టింగ్ యాప్స్‌కు బానిసగా మారి..
భానుప్రకాశ్ సరదాగా యాప్స్‌లో బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు. రూ.100, రూ.200, రూ. 500 కాస్తా.. రాను రాను రూ. వేలు, లక్షల్లోకి వెళ్లింది. దీంతో తన జీతంతో పాటు అప్పులు చేసి బెట్టింగ్యాప్స్లో పెట్టడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులు కూడా పోవడంతో బెట్టింగ్‌కు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. దీంతో దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులు కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఇలా రూ.70 లక్షల నుంచి రూ. 80 లక్షలు కోల్పోయాడు.
రివాల్వర్ పోతే పోనియ్ అనుకొని..
బెట్టింగ్‌లో డబ్బులు పోయి అప్పుల పాలైన ఎస్సై భానుప్రకాశ్‌కు ఎవ్వరూ ఒక్క రూపాయి ఇవ్వడానికి ముందుకు రాలేదు. దగ్గరి బంధువులు, దూరపు చుట్టాలు, స్నేహితుల దగ్గర వదలకుండా అప్పు చేసిన భానుప్రకాశ్..తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేకపోవడంతో తట్టుకోలేకపోయాడు. చివరకు తన సర్వీస్రివాల్వర్(9 ఎంఎం) ను తనకు తెలిసిన వ్యక్తి దగ్గర కుదువపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. బుల్లెట్స్ మాత్రం తీసి భానుప్రకాశ్ తన దగ్గరే పెట్టుకున్నాడు.
