ప్రసవం చేసేందుకు 9 కి.మీ. కాలినడకన వెళ్లిన సిబ్బంది

ప్రసవం చేసేందుకు 9 కి.మీ. కాలినడకన వెళ్లిన సిబ్బంది

అమ్రాబాద్, వెలుగు: మారుమూల చెంచుపెంటలో పురిటి నొప్పులతో బాధపడుతున్న చెంచు మహిళకు 108, బైక్ అంబులెన్స్ సిబ్బంది ఇంటి దగ్గరకే వెళ్లి పురుడు పోసి.. రెండు ప్రాణాలను కాపాడారు. నాగర్ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలం చెంచుపెంటకు చెందిన మనెమ్మకు నెలలు నిండడంతో శనివారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు తీవ్రం కావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబసభ్యులు 108 అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. మన్ననూర్ నుంచి 108తోపాటు గవర్నర్ తమిళిసై ప్రారంభించిన బైక్ అంబులెన్స్ బయలుదేరాయి. అడవిగుండా ప్రయాణిస్తుండగా 108 అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. సిబ్బంది మల్లయ్య, సుజాత, పైలట్ వెంకటేశ్వర్లు బైక్​ అంబులెన్స్​ను  తోసుకుంటూ 9 కి.మీ కాలినడకన వెళ్లి ప్రసవం చేశారు. మనెమ్మకు ఆడపిల్ల పుట్టింది. అనంతరం ఇద్దరినీ ఆపసోపాలు పడుతూ అంబులెన్స్ వద్దకు చేర్చి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.