‘కాట్సా’​కు సవరణలు చేసిన యూఎస్

‘కాట్సా’​కు సవరణలు చేసిన యూఎస్

వాషింగ్టన్: ఆంక్షల ద్వారా అమెరికా శత్రు దేశాలకు చెక్​ పెట్టే చట్టం(కాట్సా) నుంచి ఇండియాకు అమెరికా విముక్తి కల్పించింది. ఇందు కోసం ఆ దేశ ప్రతినిధుల సభ వాయిస్ ​ఓటుతో లెజిస్లేటివ్​అమెండ్​మెంట్​ చేసింది. దీంతో రష్యా నుంచి ఎస్​400 డిఫెన్స్​ సిస్టమ్ ​మిస్సైళ్లు కొనుగోలు చేసి, చైనా దురాక్రమణలకు చెక్​ పెట్టేందుకు ఇండియాకు మార్గం సుగమమైంది. గురువారం సమావేశమైన అమెరికా ప్రతినిధుల సభ ఈ లెజిస్లేటివ్ ​అమెండ్​మెంట్​ చేసింది. ఇండియన్ ​అమెరికన్​ కాంగ్రెస్​ మ్యాన్​ రో ఖన్నా.. హౌస్​లో ఈ సవరణను ప్రవేశపెట్టారు. చైనా లాంటి దేశాల నుంచి దురాక్రమణలను తిప్పికొట్టేందుకు కాట్సా నుంచి ఇండియాకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని బైడెన్​ అడ్మినిస్ట్రేషన్​ను ఈ అమెండ్​మెంట్​ ద్వారా ఖన్నా కోరారు. ‘‘చైనా అదేపనిగా ఇండియాను కవ్విస్తోంది. రానురాను ఆ దేశ దురాక్రమణలు పెరుగుతున్నాయి. ఈ టైమ్​లో మనం(అమెరికా) ఇండియాకు అండగా నిలబడాలి. చైనా ఆగడాలను ఇండియా తిప్పికొట్టేలా చూడాలి. రష్యా నుంచి ఇండియా డిఫెన్స్​ మిస్సైళ్లు కొనుగోలు చేసేందుకు వీలుకల్పించే అమెండ్​మెంట్..​ హౌస్​లో పాసవడంపై గర్వంగా ఉంది” అని ఖన్నా తెలిపారు. 

ఏంటీ కాట్సా?
2014లో క్రిమియాపై రష్యా దాడిచేసి ఆక్రమించింది. అలాగే 2016 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లోనూ వేలు పెట్టిందని రష్యాపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రష్యా నుంచి మిలిటరీ హార్డ్​వేర్​, డిఫెన్స్ సిస్టమ్​లను కొనే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా 2017లో కాట్సా యాక్టు అమల్లోకి తెచ్చింది. రష్యాతో డిఫెన్స్​, ఇంటెలిజెన్స్ సెక్టార్లలో ఒప్పందాలు చేసుకునే ఏ దేశంపైనైనా ఆంక్షలు విధించేందుకు ఇది వీలు కల్పించింది. ఎస్​400 డిఫెన్స్ ​మిస్సైల్ ​సిస్టమ్​లను కొనుగోలు చేసేందుకు 2018లో రష్యాతో మనదేశం రూ.40 వేల కోట్లతో డీల్​ చేసుకుంది. ఈ డీల్​పై నాటి ట్రంప్​ సర్కారు అభ్యంతరం చెప్పినా లెక్కచేయలే. దాంతో అమెరికా కాట్సా కింద ఆంక్షలు విధించింది. తాజాగా ఆంక్షల నుంచి ఇండియాను తొలగించింది.