ఇరాన్ పై బాంబుల వర్షం..టెహ్రాన్ సహా అనేక సిటీలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు

ఇరాన్ పై బాంబుల వర్షం..టెహ్రాన్ సహా అనేక సిటీలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు
  • మినాబ్​లో గర్ల్స్ స్కూల్​పై బాంబులు.. 85 మంది మృతి
  • లొంగిపోతరా.. చచ్చిపోతరా?.. ఇరాన్ బలగాలకు ట్రంప్ వార్నింగ్
  •  రాత్రిపూట అన్ని చోట్లా బాంబులు వేస్తామని ప్రకటన 
  •  ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రజలకు పిలుపు
  • టెహ్రాన్​లోని ఖమేనీ ఆఫీసుపైనే తొలి దాడి.. అనేక చోట్ల అటాక్స్  
  • అమెరికా, ఇజ్రాయెల్​పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్
  • యూఏఈ, సౌదీ, ఖతార్​లోని యూఎస్ స్థావరాలు, ఇజ్రాయెల్ పైకి మిసైల్స్
  • దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా

టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: పశ్చిమాసియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేయగా.. ఇరాన్ వందలాది మిసైల్స్, డ్రోన్​లతో ప్రతీకార దాడులకు దిగింది. దీంతో కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియా ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమన్నది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించాయి. వెంటనే ప్రతీకార దాడులు ప్రారంభించిన ఇరాన్ పెద్ద ఎత్తున మిసైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్​తోపాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ బాంబు దాడులతో యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్​లోని అనేక ప్రాంతాలు దద్దరిల్లాయి.

దీంతో పశ్చిమాసియాలో చైన్ రియాక్షన్​లా అనేక దేశాల్లో వరుసగా భారీ పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్​తోపాటు గల్ఫ్ దేశాలన్నీ తమ గగనతలాలను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి.  టెహ్రాన్​లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయ సమీప ప్రాంతాలే లక్ష్యంగా తొలి దాడులు జరిగాయి. 


రాజధాని టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా పేలుళ్లు సంభవించాయి. దాడి సమయంలో 86 ఏళ్ల ఖమేనీ కార్యాలయంలో ఉన్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. అక్కడి నుంచి ఆయనను ముందే రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. దక్షిణ ఇరాన్‌‌‌‌లోని మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో సాధారణ పౌరులతో సహా 87మంది విద్యార్థులు మరణించారని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. ఈ దాడుల లక్ష్యాల్లో ఇరాన్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కూడా ఉన్నారని ఒక అమెరికా అధికారి తెలిపారు.

అయితే అగ్రనేతలు ఎవరైనా మరణించారా అనే దానిపై సమాచారం వెల్లడికాలేదు. కాగా, ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ 'ఆపరేషన్ లయన్స్ రోర్', అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో దాడులు చేపట్టగా.. ఇరాన్ ప్రతీకారంగా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’ పేరుతో 
ప్రతీకార దాడులు ప్రారంభించింది. 

లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామన్న ట్రంప్.. 

ఇరాన్ పై దాడుల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. 1979 నుంచి దేశాన్ని ఏలుతున్న ఇస్లామిక్ పాలనను అంతం చేసి, "మీ విధిని మీరే నిర్దేశించుకోండి" అని పిలుపునిచ్చారు. "మేము దాడులు పూర్తి చేసిన తర్వాత, మీ ప్రభుత్వాన్ని మీరే స్వాధీనం చేసుకోండి. తరతరాలకు దక్కని ఏకైక అవకాశం ఇది. ఇన్నాళ్లూ మీరు అమెరికా సహాయం కోరారు, ఇప్పుడు అది అందుతోంది" అని ట్రంప్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని, అమెరికాను తాకగల క్షిపణులను తయారు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఉగ్రవాద ముఠాలకు అందుతున్న సహాయాన్ని నిలిపివేయడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆయుధాలు విడిచిపెడితే రక్షణ కల్పిస్తామని, లేదంటే మరణం తప్పదని హెచ్చరించారు. "ఈ ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే వాతావరణం ఏర్పడుతుంది" అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు.   

యూఏఈ, ఖతార్, సౌదీలో పేలుళ్లు 

అమెరికా, -ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ శనివారం ఉదయం భారీ ఎత్తున క్షిపణి దాడులు ప్రారంభించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్‌‌‌‌తో పాటు గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. మరోవైపు యెమెన్‌‌‌‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా అమెరికా, ఇజ్రాయెల్ పై దాడులు చేస్తామని ప్రకటించారు.

ఇండిగో, ఎయిరిండియా సర్వీసులు రద్దు..  

 పశ్చిమాసియా దేశాల్లో మారుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ శనివారం మధ్యప్రాచ్య దేశాలకు నడిపే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్ గగనతలంలో ఆంక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. దుబాయ్, జెడ్డా, దోహా, అబుదాబి, బహ్రెయిన్, షార్జా, కువైట్, రస్ అల్-ఖైమా నగరాలకు వెళ్లే విమానాలను ఇండిగో రద్దు చేసింది. శనివారం అర్ధరాత్రి వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని సంస్థ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఎయిర్ ఇండియా కూడా పశ్చిమాసియా దేశాలకు వెళ్లే అన్ని విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడంతో మధ్యలోనే వెనుదిరిగింది. ఈ విమానాన్ని ముంబైలో ల్యాండ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని బట్టి విమాన సర్వీసుల పునరుద్ధరణపై తదుపరి నిర్ణయం 
తీసుకుంటామని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాయి.

ఇరాన్​లో 200 మందికిపైగా మృతి

ఇరాన్‌‌లోని మొత్తం 31 ప్రావిన్స్‌‌లకుగాను 24 ప్రావిన్స్‌‌లపై ఈ దాడుల ప్రభావం పడినట్టు తెలిపింది. 200 మందికి పైగా మృతిచెందారని, 747 మంది గాయపడ్డారని ఇరానియన్ రెడ్ క్రీసెంట్ సంస్థ వెల్లడించింది. దాడులు ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇదే.

ఖమేనీ ఎక్కడ? 


ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా (ఛానల్ 12) కథనాలు ప్రసారం చేసింది. ఆయన కార్యాలయంపై జరిగిన దాడుల్లో ఖమేనీ చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ ఈ వార్తలను కొట్టిపారేశారు. ఖమేనీతోపాటు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని, వారు బతికే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

గర్ల్స్ స్కూల్​పై బాంబుదాడి.. 85 మంది మృతి 

ఇజ్రాయెల్, అమెరికా దళాలు శనివారం జరిపిన భారీ వైమానిక దాడుల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఇరాన్‌‌‌‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక బాలికల పాఠశాలపై బాంబులు పడటంతో విద్యార్థినులు సహా 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది గాయపడ్డారు. తాజా ఆపరేషన్‌‌‌‌లో తమ భూభాగంపై మరణాలు సంభవించినట్లు ఇరాన్ ధృవీకరించడం ఇదే మొదటిసారి.

మినాబ్ నగరంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌‌‌‌కు చెందిన కీలక స్థావరం ఉండటంతో, ఆ స్థావరం టార్గెట్ గా ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై వైట్ హౌస్ లేదా ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు.  కాగా, తాము జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పాక్‌‌‌‌పూర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్నీ తమ గగనతలాలను పూర్తిగా మూసివేశాయి. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని గాలిలోనే కూల్చివేస్తున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ వ్యాప్తంగా ప్రమాద హెచ్చరికల సైరన్లు మోగుతున్నాయి. పరిస్థితి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది.

ఇరాన్ అంతటా బాంబుల వర్షం కురుస్తుంది. ఇరాన్ సాయుధ దళాలు తక్షణమే లొంగిపోవాలి. ఆయుధాలు విడిచిపెట్టిన వారికి పూర్తి రక్షణ కల్పిస్తాం. ఎదురుతిరిగితే మరణం ఖాయం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించకుండా మేం అడ్డుకుంటాం.

- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​-