అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి.. శాన్ డియాగో సిటీలో ఘటన

అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి.. శాన్ డియాగో సిటీలో ఘటన

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం రేగింది. శాన్ డియాగో సిటీలోని అతిపెద్దదైన ‘ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాన్ డియాగో’ మసీదు ప్రాంగణంలోకి ఇద్దరు టీనేజర్లు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మసీదు సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారని తెలిపారు. ఆయన చూపిన ధైర్య సాహసాల వల్లే చాలా మంది ప్రాణాలు దక్కాయని, లేదంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని చెప్పారు.

కాల్పులు జరిపిన తర్వాత  నిందితులిద్దరూ స్పాట్‌‌‌‌‌‌‌‌కు కొద్ది దూరంలోనే తమ వాహనంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఈ కేసును హేట్ క్రైమ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దుండగులలో ఒక టీనేజర్ తల్లి సోమవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడు ఇంట్లో ఉన్న కొన్ని ఆయుధాలు, వాహనంతో సహా కనిపించకుండా పోయాడని ఆమె పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

పోలీసులు వెంటనే అప్రమత్తమై ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం ఆ యువకుడి ఇంట్లో  సోదాలు జరిపిన పోలీసులు ఒక లేఖను గుర్తించారు. అందులో విద్వేషపూరిత వ్యాఖ్యలు ఉన్నాయని ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసినట్టు తెలుస్తోందని స్పష్టం చేశారు.