ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సెల్యూట్ చేద్దాం

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సెల్యూట్ చేద్దాం
  • ‘వైరస్ నుంచి స్వేచ్ఛ’ పేరుతో జులై 4న సంబురాలు: బైడెన్‌‌‌‌
  • ఇండిపెండెన్స్ డే వేడుకలపై వైట్ హౌస్ అధికారుల ప్రకటన

వాషింగ్టన్: కరోనా మహమ్మారి నుంచి కోలుకుని సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న వేళ జులై 4న  ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలకు అమెరికా రెడీ అవుతోంది.  16 నెలల తర్వాత జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో 'వైరస్ నుంచి స్వేచ్ఛ' పేరుతో వేడుకలను నిర్వహించుకుంటామని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు.   బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాతి నుంచి ఈసారి సమ్మర్ హాలిడే పెద్ద ఈవెంట్ కానుంది.  వాషింగ్టన్ లోని నేషనల్ మాల్ లో నిర్వహించే ఫైర్ వర్క్స్ వేడుకల్లో రెస్పాండర్లు, ఎసెన్షియల్ వర్కర్లు, మిలటరీ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి బైడెన్ పాల్గొంటారు.  దాదాపు వెయ్యి మంది గెస్ట్​లు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. 'ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరూ వేడుకలు నిర్వహించడం ద్వారా కలిసి రావాలి. కరోనాపై  పోరాడిన ఫ్రంట్ లైన్ వారియర్లకు సెల్యూట్ చేస్తూ.. కరోనాపై పోరాటంలో పైచేయి సాధించినందుకు సంబురాలు జరుపుకుందాం' అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.  'జులై 4 నాటికి మంచి రోజులు వస్తాయి. మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారు' అని మార్చి 11న బైడెన్ ప్రకటించారు. కరోనా కేసులు, మరణాలు తగ్గుతుండటంతో  స్కూళ్లు, బిజినెస్ లు రీఓపెన్ అవుతున్నాయి. కరోనా ఆంక్షల నుంచి సడలింపులు ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకు మాస్కుల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. పబ్లిక్ హెల్త్ క్రైసిస్ నుంచి ఎకానమీ పునరుద్ధరణ వైపు దృష్టి పెట్టిన బైడెన్.. ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.