
- భారీగా పెరగనున్న జీసీసీలు
న్యూఢిల్లీ: ట్రంప్ సర్కారు విధించిన హెచ్-1బీ వీసా ఆంక్షలతో అమెరికా కంపెనీలు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. హెచ్1బీ వీసాలతో ఇండియా నిపుణులను అమెరికా రప్పించేందుకు బదులు ఇక్కడే ఆఫీసులు తెరవాలని భావిస్తున్నాయి. ఫలితంగా మనదేశానికి మరిన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీల) వస్తాయని భావిస్తున్నారు.
ఆర్థిక వ్యవహారాలు, పరిశోధన, అభివృద్ధి వంటి పనులు చేయడానికి ఇతర దేశాల్లో విదేశీ కంపెనీలు ఏర్పాటు చేసే సంస్థలను జీసీసీలు అంటారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో 1,700 జీసీసీలు ఉన్నాయి. ప్రపంచంలోని జీసీసీలలో సగానికి పైగా ఇక్కడే ఏర్పాటయ్యాయి. టెక్నాలజీ సపోర్ట్, లగ్జరీ కార్ల డాష్‌బోర్డ్‌ల డిజైన్ నుంచి కొత్త డ్రగ్స్వరకు ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్ ఎదిగింది. చాలా అమెరికా కంపెనీలు వ్యాపారాలను ఇండియాకు మార్చడం గురించి ఆలోచిస్తున్నాయని డెలాయిట్ ఇండియా సీనియర్ఎగ్జిక్యూటివ్ రోహన్ లోబో అన్నారు.
జీసీసీల ఏర్పాటు కోసం ప్లాన్లను రెడీ చేస్తున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ రంగాలకు చెందిన కంపెనీలు భారత్‌వైపు చూస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో జీసీసీలు మరింత కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలపై మరింత ఒత్తిడిని పెంచుతూ, హెచ్-1బీ వీసా ఫీజును ఈ నెలలో ట్రంప్ లక్ష డాలర్లకు పెంచారు. హెచ్-1బీ, ఎల్-1 వర్కర్ వీసా రూల్స్‌ను కఠినతరం చేయడానికి అమెరికా సెనేటర్లు సోమవారం ఒక బిల్లును తిరిగి ప్రవేశపెట్టారు. వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేయకుండా అరికట్టడం దీని లక్ష్యం.
ట్రంప్ వీసా ఆంక్షలు కొనసాగితే, అమెరికా కంపెనీలు ఏఐ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్ పనులను తమ భారతదేశ జీసీసీలకు మార్చుకుంటాయని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా ఇండియాలో ఆఫీసులు తెరవాలని కంపెనీలు కోరుకుంటున్నాయని ఏఎన్ఎస్ఆర్ సీఈఓ లలిత్ అహుజా అన్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, జేపీ మోర్గన్, వాల్‌మార్ట్ వంటి బిగ్ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాలతో భారీగా ఇండియా టెకీలను నియమించుకున్నాయి. ఇండియాతోపాటు మెక్సికో, కొలంబియాలోనూ కంపెనీలు కార్యకలాపాలను పెంచవచ్చని, కెనడా సైతం ప్రయోజనం పొందవచ్చని ఒక రిటైల్ జీసీసీ ఇండియా హెడ్ అన్నారు.