వాషింగ్టన్: అమెరికా ఫార్మా కంపెనీ నోవావాక్స్ తమ కరోనా టీకా 90శాతం పనితనం చూపించిందని వెల్లడించింది. దాదాపు అన్ని వేరియెంట్లనూ వ్యాక్సిన్ ఎదుర్కోగలదని తెలిపింది. వాడటానికి సురక్షితమైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువని ప్రాథమిక సమాచారం ప్రకారం తేలినట్టు పేర్కొంది. తమ వ్యాక్సిన్‌ను ఈజీగా స్టోర్ చేయొచ్చని, రవాణా కూడా సులువని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అమెరికా, యూరప్, ఇతర దేశాల్లో అనుమతులు పొందుతామని చెప్పింది. సెప్టెంబర్ నుంచి నెలకు 10 కోట్ల డోసులు, డిసెంబర్ నుంచి 15 కోట్ల డోసుల ఉత్పత్తికి ప్లాన్ చేస్తున్నామంది. దిగువ, మధ్య తరగతి దేశాలకు తొలుత తమ టీకాలు అందిస్తామని నోవావాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాన్లే ఎర్క్ తెలిపారు. అమెరికాలో సగం మందికన్నా ఎక్కువగా కనీసం ఒక్క టీకానైనా వేసుకున్నారని, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక్క శాతం జనాభా కూడా ఇంకా టీకా వేసుకోలేదని వరల్డ్ డేటా ప్రకారం తేలిందన్నారు. 18ఏళ్లు దాటిన 30వేల మందిపై నోవావాక్స్ టీకా ట్రయల్స్ జరిగాయి. వీటిల్లో మూడో వంతు మంది 3 వారాల వ్యవధిలో 2 డోసులు తీసుకున్నారు. మిగతావాళ్లకు డమ్మీ డోసులిచ్చారు. టీకా తీసుకున్న వాళ్లలో 14 మందికి, డమ్మీ డోసులు తీసుకున్న వాళ్లలో 63 మందికి వైరస్ సోకింది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లలో కరోనా తీవ్రత చాలా తక్కువుంది. యూకే వేరియంట్‌పై నోవావాక్స్ పని చేస్తుందని తేలింది.
