లీటర్ పెట్రోల్ రూ. 550, డీజిల్ రూ. 460

లీటర్ పెట్రోల్ రూ. 550, డీజిల్ రూ. 460

పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని విధంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ లపై ఆధారపడిన ఇతర వస్తువులు ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే.. బతకడం కష్టమని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కడ కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న సంగతి తెలిసిందే. ఇంధన, ఆర్థిక, ఆహార సంక్షోభాలు తీవ్ర విషాదాన్ని కలుగ చేస్తున్నాయి. తాజాగా.. పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం 22 శాతం పెంచేశారు. విదేశీ మారక ద్రవ్యం, పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గిపోవడంతో తీవ్ర కొరత నెలకొంది. అక్కడి కరెన్సీ ప్రకారం పెట్రోల్ ధర రూ. 550, డీజిల్ ధర రూ. 460కి చేరుకున్నాయి. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు పెరుగుతున్న ధరలతో అష్టకష్టాలు పడుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి నిలబడుతున్నారు.

పెట్రోల్ కోసం క్యూలో ఐదు రోజులుగా నిలబడిన ఓ వృద్ధుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. పెట్రోల్ కోసం వాహనాలను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. దిగుమతులు ఆలస్యం అవుతుండడంతో ధరలు పెంచాల్సి వస్తోందని శ్రీలంక చమురు మంత్రిత్వ శాఖ మంత్రి వెల్లడించారు. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితి చూసి ఇతర దేశాలు చలించిపోయి.. ఆర్థిక సహాయం అందచేస్తున్నాయి. భారత్ తో సహా వివిధ దేశాలు అందిస్తున్న రుణాలు, ఆర్థిక సాయంతో గడుస్తోంది. తమను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాలన్న శ్రీలంక విజ్ఞప్తితో అమెరికా స్పందించింది. ఆ దేశానికి ఏమి అవసరం ? ఎలాంటి సాయం చేస్తే బాగుంటుందనే దానిపై తమ బృందం పరిశీలిస్తోందని అమెరికా వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా బృందం శ్రీలంకలో పర్యటిస్తోంది.