
న్యూఢిల్లీ: భారత్‌లో బాయ్‌కాట్ టర్కీ ట్రెండ్ నడుస్తోంది. ఇందుకు కారణం భారత బద్ద శత్రువైన పాకిస్థాన్‌కు టర్కీ మద్దతుగా నిలవడమే. మద్దతుగా నిలవడమే కాకుండా భారత్‌పై దాడులు చేసేందుకు కూడా టర్కీ పాకిస్థాన్‌కు ఆయుధాలు కూడా సరఫరా చేస్తోంది. దీంతో టర్కీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఇండియన్స్.. సోషల్ మీడియాలో బాయ్ కాట్ టర్కీ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్‌లో టర్కీ వస్తువులను బాయ్ కాయ్ చేయాలని పిలుపునిస్తున్నారు.
ఈ క్రమంలో బాయ్‌కాయ్ టర్కీ ట్రెండ్ పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ స్పందించారు. నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్ అని.. మంచైనా, చెడైనా పాక్ వెంటే ఉంటామని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నా ఆప్త మిత్రుడని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పాకిస్థాన్‌కు ఏం సాయం అవసరమైన అందిస్తామని కుండబద్దలు కొట్టారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ.. ఇస్లామాబాద్‌కు టర్కీ మద్దతును ఎర్డోగన్ బహిరంగంగా ప్రకటించాడు.
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎర్డోగన్ ఓ పోస్ట్ చేశాడు. ‘‘పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నా ప్రియమైన సోదరుడు. తుర్కియే, పాకిస్తాన్ మధ్య సోదరభావం నిజమైన స్నేహానికి ఉత్తమ ఉదాహరణలలో ఒకటి. పాకిస్తాన్ శాంతి, ప్రశాంతత, స్థిరత్వానికి మేం చాలా ప్రాముఖ్యతనిస్తాము. వివాదాలను పరిష్కరించడంలో చర్చలు, రాజీకి ప్రాధాన్యతనిచ్చే పాకిస్తాన్ వివేకవంతమైన, ఓపిక గల విధానాన్ని మేము అభినందిస్తున్నాము. గతంలో భవిష్యత్తులో మంచి, చెడు సమయాల్లో ఎప్పుడైనా పాక్ పక్షానే ఉంటాం’’ అని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు.
ఎర్డోగన్ వ్యాఖ్యలు చూసి భారతీయులు మరింత ఆగ్రహంతో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే టర్కీ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలంగా ఉంది. టర్కీ వస్తువులను భారత బాయ్ కాట్ చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కానీ సొంత దేశం గురించి కూడా పట్టించుకోకుండా భారత శత్రు దేశానికి ఎర్డోగన్ బహిరంగంగా మద్దతు తెలపడంపై ఇండియన్స్ భగ్గుమంటున్నారు.