చెరువు విస్తరణ పేరుతో ఆంక్షలు సరికాదు : నర్సింగ్ రావు

చెరువు విస్తరణ పేరుతో ఆంక్షలు సరికాదు : నర్సింగ్ రావు
  •     అమీన్‌పూర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్

ముషీరాబాద్, వెలుగు: అమీన్‌పూర్ చెరువు విస్తరణ పేరుతో భూములపై ఆంక్షలు విధించడం సరికాదని అమీన్‌పూర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది. బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులు స్వర్ణ శ్రీ, సాంబయ్య, సత్యనారాయణ, కృష్ణంరాజు, నర్సింగ్ రావు తదితరులు ధర్నా చేపట్టారు. తాము 1985లో చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు అమీన్‌పూర్ పెద్ద చెరువు విస్తరణ అంటూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మొదట 98 ఎకరాల పరిధిలోనే ఉన్న చెరువు చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో క్రమంగా 450 ఎకరాలకు విస్తరించిందని ఆరోపించారు. దాన్ని చూపుతూ తమ భూములు బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయంటూ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో భూములు కొనుగోలు చేసిన సుమారు 3 వేల మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లామని, న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.