Amit Mishra: 25 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్‌ ముగిసింది: క్రికెట్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రిటైర్మెంట్

Amit Mishra: 25 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్‌ ముగిసింది: క్రికెట్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రిటైర్మెంట్

టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గురువారం (సెప్టెంబర్ 4) మిశ్రా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ధృవీకరించాడు. 42 ఏళ్ళ ఈ సీనియర్ స్పిన్నర్ 25 సంవత్సరాల పాటు సుదీర్ఘ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. "నా క్రికెట్ జీవితంలో ఈ 25 సంవత్సరాల క్రికెట్ ఎంతో చిరస్మరణీయమైనది. నా క్రికెట్ కెరీర్ లో నాతో ఉన్న బీసీసీఐ,పరిపాలన, హర్యానా క్రికెట్ అసోసియేషన్, సహాయక సిబ్బంది, నా సహచరులు, నా కుటుంబ సభ్యులకు నేను చాలా కృతజ్ఞుడను. అని మిశ్రా అన్నారు.

"నేను ఆడినప్పుడల్లా, ఎక్కడ ఆడినా అభిమానుల ప్రేమ, మద్దతు ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చింది. క్రికెట్ నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను అమూల్యమైన పాఠాలను ఇచ్చింది. గ్రౌండ్ లో గడిపిన ప్రతి క్షణం నేను జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం." అని మిశ్రా రిటైర్మెంట్ తర్వాత అన్నాడు. వరుసగా గాయాలు, రాబోయే క్రికెటర్లకు అవకాశాలను ఇవ్వాలనే తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. 

మిశ్రా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం 2003లో జరిగింది. తొలి టెస్ట్ 2008లో ఆస్ట్రేలియాపై మొహాలీలో ఆడాడు. తొలి టెస్టులోనే 5 వికెట్లు పడగొట్టి సంచలనంగా మారాడు. 2013లో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టి ఒకే వన్డే సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత క్రికెటర్ గా నిలిచాడు. లెజెండరీ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ లెగ్ స్పిన్నర్ అంతర్జాతీయ కెరీర్‌లో 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడి వరుసగా 76, 64, 16 వికెట్లు పడగొట్టాడు.

►ALSO READ | Haider Ali: హైదర్ అలీకి బిగ్ రిలీఫ్.. అత్యాచార ఆరోపణల కేసులో నిర్దోషిగా తేలిన పాకిస్తాన్ క్రికెటర్

బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 టీ20 ప్రపంచ కప్‌లో మిశ్రా ఆడాడు. ఇండియా రన్నరప్ గా నిలిచిన ఈ టోర్నీలో 10 వికెట్లు పడగొట్టాడు. 2017లో మిశ్రా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్ ఆడుతూ తన క్రికెట్ కెరీర్ ను కొనసాగించాడు. 2024 ఐపీఎల్ లో తన చివరి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాజస్థాన్ రాయల్స్‌పై ఆడాడు. ఐపీఎల్ లో మిశ్రాకు అద్భుతమైన రికార్డ్ ఉంది. 162 మ్యాచ్‌ల్లో 23.82 యావరేజ్, 7.37 ఎకానమీ రేటుతో 174 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్ గా నిలిచాడు. 

ఐపీఎల్ చరిత్రలో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లపై హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. యువ ఆటగాళ్లకు కోచింగ్, కామెంట్రీ ద్వారా క్రికెట్‌తో కనెక్ట్ అవ్వాలని మిశ్రా యోచిస్తున్నాడు.