Haider Ali: హైదర్ అలీకి బిగ్ రిలీఫ్.. అత్యాచార ఆరోపణల కేసులో నిర్దోషిగా తేలిన పాకిస్తాన్ క్రికెటర్

Haider Ali: హైదర్ అలీకి బిగ్ రిలీఫ్.. అత్యాచార ఆరోపణల కేసులో నిర్దోషిగా తేలిన పాకిస్తాన్ క్రికెటర్

అత్యాచారం కేసులో పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీకి బిగ్ రిలీఫ్. ఇంగ్లాండ్ లో జరిగిన అత్యాచార కేసులో హైదర్ అలీ నిర్దోషి అని తేలింది. ఈ కేసును కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తెలియజేసినట్టు సమాచారం. ఆగస్టు ప్రారంభంలో ఈ 24 ఏళ్ల బ్యాటర్ ఒకరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని ఇంగ్లాండ్ లో అరెస్ట్ చేశారు. అలీని కెంట్‌లోని స్పిట్‌ఫైర్ కౌంటీ గ్రౌండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

సరైన ఆధారాలు లేకపోవడంతో అలీని GMP, యూకె క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ (CPS) విడుదల చేయనున్నాయి. ఈ పరిస్థితికి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. హైదర్ అలీ 2020లో పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్ లో ఇప్పటి వరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడిన హైదర్..  35 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 21 సగటుతో 42 పరుగులు.. టీ20ల్లో 17.4 సగటుతో 505 పరుగులు చేశాడు. అయితే ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. చివరిసారిగా 2023లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ తరఫున ఆడాడు.

అసలేం జరిగిందంటే..? 

2025 జూలై 23న హైదర్ అలీ తనపై అత్యాచారం జరిపినట్లు ఒక యువతి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 3న హైదర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 4న పోలీసులు హోవ్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్-ఏ తరఫున ఇంగ్లాండ్-ఏ జట్టుతో బెకెన్హెయిమ్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాల్గొంటున్న ఈ పాక్ క్రికెటర్  అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు.