వర్షాల కారణంగా బ్రేక్.. అమిత్​షా, ప్రియాంక సభలు వాయిదా

వర్షాల కారణంగా బ్రేక్..  అమిత్​షా, ప్రియాంక సభలు వాయిదా
  • వర్షాల కారణంగా బ్రేక్..  అమిత్​షా, ప్రియాంక సభలు వాయిదా
  • వర్షాల కారణంగా బ్రేక్ ప్రకటించిన నేతలు
  •  ప్రియాంక సభ వచ్చే నెల 5 లేదా 7న నిర్వహించే చాన్స్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండటంతో ఈ నెల 29న హైదరాబాద్​కు రావాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్​షా టూర్ రద్దయింది. అలాగే, ఈ నెల 30న కొల్లాపూర్​లో జరగాల్సిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ సభ కూడా వాయిదా పడింది. ఈ నెల 29 న ఖమ్మంలో భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. 

వర్షాల కారణంగా దాన్ని రద్దు చేసి, బదులుగా హైదరాబాద్​లో వివిధ సామాజిక వర్గాల మేధావులు, కళాకారులు, కవులు, ఉద్యమకారులతో షా సమావేశాన్ని రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభ కోసం  ఏర్పాట్లు జరుగుతుండగా.. రాష్ట్రంలో వర్షాలు పెరగడంతో దీనిని కూడా రద్దు చేస్తున్నట్లు నేతలు గురువారం ప్రకటించారు. వాస్తవానికి మొదట ఖమ్మం సభ గత నెల 15 న నిర్వహించాలని ప్లాన్ చేయగా.. అప్పుడు గుజరాత్ లో తుఫాన్ కారణంగా ఈ నెల 29 కి వాయిదా వేశారు. వర్షాల కారణంగా అటు ఖమ్మంలో సభ జరగక, ఇటు హైదరాబాద్​లనూ సాధ్యంకాక అమిత్​షా టూర్ మూడుసార్లు వాయిదా పడింది.

ALSO READ :గురుకుల స్కూల్లో .. గుండెపోటుతో ఇంటర్ స్టూడెంట్​ మృతి

హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి కొల్లాపూర్​లో సభ 

ఈ నెల 30న కొల్లాపూర్​లో ప్రియాంక సభ పెట్టాలని కాంగ్రెస్​ ప్లాన్​ చేసింది. ఈ సభలోనే బీఆర్ఎస్​ మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్​లో చేరాల్సి ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండటంతో తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ నేతలు సభను వాయిదా వేశారు. ప్రియాంక భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది ఇప్పటికే కొల్లాపూర్​కు వచ్చి పరిస్థితిని సమీక్షించారని పార్టీ నేతలు చెప్తున్నారు. వర్షాల గురించి వారు ప్రియాంకకు సమాచారం ఇవ్వడంతో సభను వాయిదా వేయాల్సిందిగా ఆమె సూచించారని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి చెప్పారు. 

సభ నిర్వహించేందుకు ఆగస్టు 5 లేదా ఆగస్టు 7వ తేదీలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హైకమాండ్​కు సూచించారని నేతలు చెప్తున్నారు. పార్టీ పెద్దల నిర్ణయాన్ని బట్టి ఏదోఒక తేదీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఈ నెల 20నే కొల్లాపూర్​లో సభ నిర్వహించాల్సి ఉన్నా.. వర్షాల కారణంగానే 30వ తేదీకి వాయిదా వేశారు. అదే కారణంతో మరోసారి వాయిదా వేశారు.