- కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతి ఫలితంగానే కోల్ కతా సమీపంలోని ఆనందపూర్ గిడ్డంగుల్లో అగ్నిప్రమాదం సంభవించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర 24 పరగణాల్లో జరిగిన ‘బీజేపీ కార్యకర్తల సమ్మేళనం’లో అమిత్ షా మాట్లాడారు. “ఆనందపూర్ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు. మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతే దీనికి ప్రధాన కారణం. సీఎం వెంటనే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలి. దోషులను జైలుకు పంపించాలి. ఆనందపూర్ గిడ్డంగుల్లోని ‘వావ్ మోమో’ ఫ్యాక్టరీలో ఎవరి డబ్బును పార్క్ చేశారు? ఆ ఫ్యాక్టరీ యజమాని ఎవరితో కలిసి విదేశీ ప్రయాణాలు చేశారు? యజమానిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? ”అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ ప్రమాదంపై బెంగాల్ సర్కారు స్పందించిన తీరును కూడా నిలదీశారు. “ప్రమాదం జరిగిన 32 గంటల తర్వాత మీ మంత్రి స్పాట్ కు చేరుకున్నారు. కార్మికులు లోపల ప్రాణాలు కాపాడుకోవడానికి అరుస్తుంటే మీరు మౌనంగా ఉన్నారా?’’ అని అడిగారు. ఆనందపూర్ ప్రాంతంలోని డెకరేటర్ గిడ్డంగిలో మొదలైన మంటలు పక్కనే ఉన్న ‘వావ్! మోమో’ గోదాముకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 21 మంది మరణించారు. శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
