కర్నాటకను ఏటీఎంలా వాడుకుంది.. కాంగ్రెస్​పై అమిత్ షా విమర్శ

 కర్నాటకను  ఏటీఎంలా వాడుకుంది.. కాంగ్రెస్​పై అమిత్ షా విమర్శ
  • కాంగ్రెస్ గెలిస్తే పీఎఫ్ఐపై బ్యాన్ ఎత్తేస్తదని వార్నింగ్​
  • ముస్లిం రిజర్వేషన్లపై  నిషేధం కూడా తీసేస్తరని వెల్లడి

మైసూరు : సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్  సర్కారు భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్  షా విమర్శించారు. ఆయన సీఎంగా ఉన్నపుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్  నేతలు ఏటీఎంలా వాడుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్  మళ్లీ గెలిస్తే పాపులర్  ఫ్రంట్ ఆఫ్​ ఇండియాపై నిషేధం ఎత్తివేస్తారని హెచ్చరించారు. మంగళవారం మైసూరులో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడారు. ‘‘లింగాయత్ లు అవినీతిపరులంటూ సిద్దరామయ్య వారిని అవమానించారు. ఇందుకు ఆయన సిగ్గుపడాలి. అంతకుముందు కూడా ఎస్.నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ ను సీఎం పదవుల నుంచి తొలగించి లింగాయత్  సామాజికవర్గం వారిని కాంగ్రెస్  నేతలు దారుణంగా అవమానించారు” అని షా మండిపడ్డారు.

సిద్దరామయ్య ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్లను ఎందుకు మారుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘‘ఆయన (సిద్దు) ఏ నియోజకవర్గంలో గెలిచినా అభివృద్ధి పనులు చేయరు. ఇపుడు ఆయన మైసూరులో పోటీ చేస్తున్నారు. మీకు (ప్రజలు) రిటైరయ్యే లీడర్  కావాల్నా? అభివృద్ధి చేసే ఫ్యూచర్  లీడర్  (మైసూరు అభ్యర్థి సోమణ్ణ) కావాల్నా?”. సోమణ్ణ గెలిస్తే మైసూరు డెవలప్ మెంట్ కు కృషి చేస్తరు” అని అమిత్  షా వ్యాఖ్యానించారు. 


మా సీఎంలు కర్నాటకను ముందుకు నడిపారు


ప్రధాని నరేంద్ర మోడీ కెప్టెన్సీలో మాజీ సీఎం యడియూరప్ప, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బస్వరాజ్  బొమ్మై కర్నాటక రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అమిత్  షా అన్నారు. రాష్ట్ర రైతుల కోసం యడ్డీ ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అలాగే బొమ్మై కూడా ఇరిగేషన్  ప్రాజెక్టులతో రైతులకు లబ్ధి చేకూర్చారని చెప్పారు. కర్నాటకను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేది మోడీ మాత్రమే అని పేర్కొన్నారు.

ముస్లిం రిజర్వేషన్లను తాము రద్దు చేసి మంచిపని చేశామన్నారు. ‘‘తాము మళ్లీ గెలిస్తే, ముస్లిం రిజర్వేషన్లను మళ్లీ తెస్తామని వారు (కాంగ్రెస్  నేతలు) అంటున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, లింగాయత్ లకు మేము పెంచిన రిజర్వేషన్లను కూడా రద్దుచేస్తామంటున్నరు. బుజ్జగింపు రాజకీయాలు చేయడం ఒక్కటే కాంగ్రెస్ కు తెలుసు. ప్రజల అభివృద్ధి ఆ పార్టీకి పట్టదు” అని షా విమర్శించారు. మైసూరు అభ్యర్థి సోమణ్ణను గెలిపిస్తే, రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని అత్యంత అభివృద్ధి చెందిన సిటీగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమణ్ణను గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.