టార్గెట్ 90 ..అమిత్ షా వ్యూహం

టార్గెట్ 90 ..అమిత్ షా వ్యూహం
  • బలమైన అభ్యర్థులపై బీజేపీ ఫోకస్
  • వలసలకు ప్రోత్సాహం
  • సర్కారు ఫెయిల్యూర్స్​పై 
  • దూకుడుగా పోరాటాలు
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రణాళి

సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలని అమిత్ షా సూచించినట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. జాయినింగ్స్ అంశాన్ని  కూడా ఆయన ప్రస్తావించారని అంటున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆహ్వానించి, ఎక్కడెక్కడ పార్టీకి అభ్యర్థులు లేరో ఆ లోటును భర్తీ చేసుకోవాలని, ఎప్పుడూ జనంలోనే ఉండాలని సూచించినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరికలు ఊపందుకున్నాయి. అయితే.. ఆ చేరికలు కూ‌‌డా ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం ప్రాతిపదికన జరగాలని అమిత్​ షా చెప్పినట్లు సమాచారం. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించినా.. అన్ని నియోజకవర్గాల్లో జరిగేలా చూడాలని ఆయన అన్నట్లు తెలిసింది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 90 అసెంబ్లీ సెగ్మెంట్లపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పార్టీ నేతల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా  ‘90 ఫార్ములా’ను ఉంచారు. టీఆర్​ఎస్​ను దెబ్బకొట్టాలన్నా, అధికారంలోకి రావాలన్నా.. దీన్ని ఫాలో కావాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 లో వచ్చినా, అంతకు ముందే వచ్చినా  మొత్తం 119  అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 90 చోట్ల బలమైన అభ్యర్థులను తయారు చేసుకోవాలని, ఆ తర్వాత గెలుపు సంగతి తమకు వదిలేయాలని అమిత్​షా  చెప్పినట్లు పార్టీ ముఖ్య నేతలంటున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు తమకు సానుకూలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించే పనిలో పడ్డారు. 

దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టి అభ్యర్థులు ఉండడంతోనే విజయం సాధ్యమైందని బీజేపీ అధిష్ఠానం అంచనాకు వచ్చింది. పార్టీ అభ్యర్థులు వీక్​గా ఉన్నందుకే  హుజూర్ నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిందని పోల్చుకుంది. దుబ్బాక, హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినా దుబ్బాకలో రఘునందన్ రావు, హుజూరాబాద్​లో ఈటల రాజేందర్ వంటి బలమైన లీడర్లు ఉండటంతోనే గెలిచామని అంచనాకు వచ్చింది. పార్టీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ  హుజూర్ నగర్, నాగార్జున సాగర్​లో ఓటమికి అభ్యర్థుల ఎంపిక మైనస్​ అయిందని, అక్కడ సరైన లీడర్లు లేకపోవటంతో అటువంటి పరిస్థితి తలెత్తిందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలు బేరీజు వేసుకొనే అమిత్​ షా నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన  అభ్యర్థులుండాలని పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. లేకుంటే కేడర్​ ఉన్నా గెలుపు కష్టమవుతుందని అలర్ట్​ చేసినట్లు సమాచారం. 

క్యాడర్ ఉన్న నియోజకవర్గాలు ఎన్ని? బలమైన లీడర్లు ఉన్న నియోజకవర్గాలు ఎన్ని? ఎక్కడ కొత్త అభ్యర్థులు అవసరం? అనే దానిపై బీజేపీ ఫోకస్​ పెట్టింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో బీజేపీకి 30 నుంచి 35  సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే క్యాండిడేట్లు ఉన్నారు. ఈ లెక్కన మిగతా నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు అవసరం. ఈ సెగ్మెంట్లను  గుర్తించి.. అక్కడ టీఆర్​ఎస్​, కాంగ్రెస్ కు చెందిన అసంతృప్తి, అసమ్మతివాదులను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తున్నది. రాష్ట్రంలో పవర్​లోకి రావాలంటే 60 సీట్ల మ్యాజిక్​ ఫిగర్​ దాటి సీట్లను గెలుచుకోవాలి. కనీసం 90 సీట్లలో పార్టీ తిరుగులేని శక్తిగా నిలబడితే, 60 నుంచి 70 సీట్లు గెలుచుకోవచ్చని బీజేపీ హైకమాండ్​ నమ్ముతున్నది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర నేతల ముందు అమిత్​ షా  ‘90 ఫార్ములా’ను ఉంచినట్లు తెలుస్తున్నది.

లోక్​సభ ఎన్నికల నుంచి జోష్​
2014  అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లను గెలుచుకున్న బీజేపీ.. 2018 ఎన్నికల్లో ఒక సీటును మాత్రమే గెలుచుకుంది. అయితే.. ఆ తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 4 లోక్​సభ సీట్లను గెలుచుకుంది. దీంతో బీజేపీ హైకమాండ్​ పెద్దలకు తెలంగాణపై ధీమా పెరిగింది. అవే ఎన్నికలకు ముందు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి సీనియర్లతో బీజేపీలోకి వలసలు ప్రారంభం కాగా.. ఎన్నికల తర్వాత మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతి వంటి సీనియర్ లీడర్లు చేరడంతో పార్టీ బలం పుంజుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి చెందిన రాష్ట్ర స్థాయి,  జిల్లా స్థాయి నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లు, టీఆర్ఎస్ లో కీలక పదవుల్లో ఉన్న ఉద్యమకారులు కూడా పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరేందుకు క్యూ కట్టారు. దీంతో తెలంగాణలో ఎన్నడూ లేని రీతిలో బీజేపీ తక్కువ టైంలోనే  జనానికి బాగా దగ్గరైంది. ఇదే టైంలో దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించడంతో ఆ పార్టీలో జోష్ రెట్టింపయింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 సీట్లు గెలుచుకోవడం, ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి పూర్తిగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మారింది. ప్రజా సంగ్రామ యాత్రకు  జనం నుంచి మంచి స్పందన రావడం, టీఆర్ఎస్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత ఈ యాత్ర సందర్భంగా ప్రజల నుంచి కనిపించడంతో బీజేపీ హైకమాండ్ కు ఇక్కడ పార్టీ పురోగతిపై గట్టి నమ్మకం ఏర్పడింది. సౌత్​లో కర్నాటక తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రెండో రాష్ట్రంగా తెలంగాణను గుర్తించింది. టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరించాలని నిర్ణయించుకుంది. అందుకే స్వయంగా అమిత్ షానే  రంగంలోకి దిగి.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇదే క్రమంలో ఈ నెల 21న రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రానికి చెందిన జాతీయ నేతలతో ఢిల్లీలో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది బీజేపీ జెండానే అనే భరోసాను ఇక్కడి నేతల్లో కలిగించారు. అయితే అన్ని నియోజకవర్గాల్లో బలమైన పునాదులు నిర్మించుకోవాలని, క్యాడర్ ఎంత ముఖ్యమో...వారిని నడిపే లీడర్లు కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. కనీసం 90 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను తయారు చేసుకోవాలని సూచించారు. బెంగాల్ తరహా పోరాటాలకు రెడీగా ఉండాలని సూచించారు.