నేపాల్, శ్రీలంకలో కూడా బీజేపీ ప్రభుత్వం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

నేపాల్,  శ్రీలంకలో కూడా బీజేపీ ప్రభుత్వం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: బీజేపీ లీడ‌ర్, త్రిపుర ముఖ్య‌మంత్రి బిప్ల‌వ్ దేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తమ పార్టీని నేపాల్, శ్రీలంక‌లో కూడా విస్త‌రించాలనే యోచ‌న‌లో అధిష్టానం ఉంద‌‌ని అన్నారు. అగ‌ర్త‌ల‌లో బీజేపీ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌మ పార్టీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను గెలిచిన తరువాత.. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక ల‌లో కూడా  ఏర్పాటు చేసే ఆలోచన ఉంద‌ని, అందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద ప్రణాళికలు ఉన్నాయ‌ని అన్నారు. ఈ విష‌యాన్ని గ‌తంలో అమిత్ షా రాష్ట్ర‌ బీజేపీ ఈశాన్య మండల కార్యదర్శి అజయ్ జామ్వాల్ తో ప్ర‌స్తావించార‌ని ఆనాటి సంగ‌తిని గుర్తు చేశారు.

శ్రీలంక, నేపాల్ దేశాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయని, పార్టీని అక్కడ కూడా విస్తరించి.. ఆ దేశాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల‌ని ఆనాడు షా అన్నారంటూ విప్లవ్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో, త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. ప‌శ్చిమ బెంగాల్ ప్రజలు త్వరలో టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీకి వీడ్కోలు పలుకుతారని, తమిళనాడుతో సహా దేశవ్యాప్తంగా “క‌మ‌లం వికసిస్తుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.