ప్రచారానికి  పెద్దలు దూరం!

ప్రచారానికి  పెద్దలు దూరం!
  • హుజూరాబాద్‌‌‌‌లో అమిత్‌‌‌‌ షా, కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ క్యాంపెయిన్ లేనట్టే
  • కరోనా వల్ల భారీ బహిరంగ సభలకు నో అంటున్న సీఈసీ
  • స్టార్ క్యాంపెయినర్ల సభలకూ వెయ్యి మంది  మించొద్దని రూల్
  • భారీ మీటింగ్‌‌‌‌కు పర్మిషన్‌‌‌‌ కోసం టీఆర్ఎస్ యత్నాలు
  •  థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ హెచ్చరికల నేపథ్యంలో అనుమానమే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నికలో ముఖ్య నేతల ప్రచారానికి కరోనా నిబంధనలు అడ్డంకిగా మారాయి. వెయ్యి మందితోనే బహిరంగ సభలు నిర్వహించుకోవాలనే రూల్‌‌‌‌తో కేడర్‌‌‌‌లో కీలక నేతలు జోష్‌‌‌‌ నింపే అవకాశం లేకుండా పోయింది. దాంతో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధినేత, సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రచారానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. వీరేగాక మిగతా ముఖ్య నేతలు కూడా క్యాంపెయినింగ్‌‌‌‌కు దూరం కానున్నారు. అక్కడి నేతలే బై పోల్‌‌‌‌ వ్యవహారాలన్నీ చూసుకోవాల్సి ఉంటుందని ఆయా పార్టీల వర్గాలు చెప్తున్నాయి. భారీ బహిరంగ సభలకు పర్మిషన్‌‌‌‌ ఇవ్వాలని సీఈసీని కోరామని, కానీ కరోనా థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ హెచ్చరికల నేపథ్యంలో అది సాధ్యం కాకపోవచ్చని చెప్తున్నారు.
బీజేపీ, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పోటాపోటీ
శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 30న పోలింగ్‌‌‌‌ జరగనున్న విషయం తెలిసిందే. ప్రచారానికి ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు అవకాశముంది. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌‌‌‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన నాటి నుంచి నిత్యం ఊరూరూ, ఇల్లిల్లూ చుడుతూ ప్రచారంలో తలమునకలయ్యారు. పలు గ్రామాల్లో ఈటల ఇప్పటికే పాదయాత్ర చేశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్య నేతలు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి హరీశ్‌‌‌‌రావు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఊరూరూ చుడుతున్నారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించిన కాంగ్రెస్‌‌‌‌ ఇంకా ప్రచార జోరు పెంచలేదు.
పర్మిషన్‌‌‌‌ కోసం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లాబీయింగ్‌‌‌‌
ప్రచారం ముగియడానికి ఒకరోజు ముందు కేసీఆర్‌‌‌‌ బహిరంగ సభ ఉండేలా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ చేసుకుంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసి కేడర్‌‌‌‌లో జోష్‌‌‌‌ నింపాలని భావించింది. ఇందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టింది. ఈసీ స్ట్రిక్ట్ రూల్స్‌‌‌‌ పెట్టడంతో సభకు పర్మిషన్‌‌‌‌ కోరుతూ అప్లికేషన్‌‌‌‌ పెట్టుకుంది. ఎలాగైనా అనుమతి సాధించేందుకు లాబీయింగ్‌‌‌‌ కూడా చేస్తోంది. అయితే వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌, కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉప ఎన్నికల వల్లే కరోనా సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌ ఉధృతి పెరిగిందనే వాదనలున్నాయి. ఈ విషయంలో సీఈసీ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మద్రాస్‌‌‌‌ హైకోర్టు గట్టి కామెంట్లు చేసింది. ఈ నేపథ్యం, థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ ముప్పు ఉందనే హెచ్చరికల కారణంగా రూల్స్‌‌‌‌ సడలించేందుకు ఈసీ ససేమిరా అంటోంది. కాబట్టి కేసీఆర్‌‌‌‌ సభకు అనుమతి రాకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి కూడా ఆయన దూరంగానే ఉంటారన్న చర్చ నడుస్తోంది.  హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నికను కేసీఆర్‌‌‌‌ పెద్దగా పట్టించుకోవడం లేదని మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ బుధవారం కామెంట్‌‌‌‌ చేయడం ఇందుకు సంకేతమేనంటున్నారు.
అమిత్‌‌‌‌ షా సహా ఇతర నేతల ప్రచారానికీ బ్రేక్‌‌‌‌
టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల అన్నీ తానై ప్రచారం చేసుకుంటున్నారు. సెప్టెంబర్‌‌‌‌ 17న నిర్మల్‌‌‌‌ సభలో పాల్గొన్న అమిత్‌‌‌‌ షా వేదికపై ఈటలకు టాప్‌‌‌‌ ప్రయారిటీ ఇచ్చారు. ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చారు. పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలను కూడా రప్పించాలని కమల దళం ప్లాన్‌‌‌‌ చేసుకుంది. కానీ కరోనా నిబంధనల వల్ల అమిత్‌‌‌‌ షా సహా పెద్ద నేతల ప్రచారానికి అవకాశం ఉండకపోవచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌‌‌‌ నుంచి కూడా జాతీయ నేతలెవరూ ప్రచారానకి రాకపోవచ్చంటున్నారు.
హుజూరాబాద్‌‌‌‌ వంక చూడని కేటీఆర్‌‌‌‌
టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ హుజూరాబాద్‌‌‌‌లో ఇంతవరకు అడుగు పెట్టలేదు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు రెండో ప్లేస్‌‌‌‌లో ఉన్నా భారీ సభలు, రోడ్డు షోలకు చాన్స్ లేనందున ప్రచారానికి రాకపోవచ్చని పార్టీ నేతలు చెప్తున్నారు. హరీశ్‌‌‌‌తో పాటు టీఆర్ఎస్ బై పోల్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జిలే ప్రచార బాధ్యతలు చూస్తారంటున్నారు. హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, నాగార్జునసాగర్‌‌‌‌ ఉప ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిన కేటీఆర్‌‌‌‌ దుబ్బాక బై పోల్‌‌‌‌కు పూర్తి దూరంగా ఉండటం తెలిసిందే.

ఇవీ నిబంధనలు..
కరోనా కారణంగా ఎన్నికల ప్రచార నిబంధనలను సీఈసీ కఠినతరం చేసింది. వాటిని కచ్చితంగా అమలు చేసి తీరాలని ఆదేశించింది.
ఇండోర్‌‌‌‌ మీటింగులకు 200కు మించి జనాన్ని అనుమతించొద్దు.
 ఇతర సభలకు 500 మందికి మించొద్దు.
 స్టార్‌‌‌‌ క్యాంపెయినర్ల సభలకు 1,000 మంది కంటే ఎక్కువ మంది వద్దు. 
 సభకు హాజరైన వారి సంఖ్యను కచ్చితంగా లెక్కించాలి.
 సభాప్రాంతం పోలీసుల అదుపులో ఉండాలె
 సభ ఖర్చు పార్టీ, లేదా కేండిడేట్‌‌‌‌ భరించాలి.
 ఓపెన్‌‌‌‌ గ్రౌండ్లలోనే సభలు పెట్టుకోవాలి.
 రోడ్డు షోలు, మోటార్‌‌‌‌ సైకిల్‌‌‌‌ ర్యాలీలకు వీల్లేదు.
 వీధుల్లో మీటింగులకు 50 మందినే అనుమతిస్తారు.
 డోర్‌‌‌‌ టు డోర్‌‌‌‌ ప్రచారంలో అభ్యర్థితో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి.