
జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీకి చెందిన రాజకీయ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని కొందరు అంచనా వేస్తుండగా.. ఇది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమేనని ఇంకొందరు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను అమిత్ షా చూశారని.. అందులో అద్భుతంగా నటించినందుకు ప్రశంసించేందుకే జూనియర్ ఎన్టీఆర్ ను నోవాటెల్ కు పిలిపించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద ఈ భేటీలో చర్చించే అంశాలపై పూర్తి స్పష్టత మాత్రం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ తర్వాత బీజేపీ సీనియర్ లీడర్లతో డిన్నర్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారు. అమిత్ షాను కలిసేందుకు హైదరాబాద్ కార్పొరేటర్లు కూడా నోవాటెల్ కు చేరుకున్నారు. కాగా, అంతకుముందు అమిత్ షా రామోజీ ఫిలింసిటీకి వెళ్లి రామోజీరావుతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.