ఇయ్యాల రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ

ఇయ్యాల రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ
  • ఇయ్యాల రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ
  • లిక్కర్​ స్కాంలో అరెస్టులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం
  • పాల్గొననున్న సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్​ వెంకటస్వామి
  • మంగళవారమే బీజేపీ ‘స్ట్రీట్ కార్నర్’ ముగింపు సభలు
  • వాటి బాధ్యత వేరే నేతలకు అప్పగించి ఢిల్లీ రావాలన్న హైకమాండ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో బీజేపీ రాష్ట్ర మినీ కోర్​ కమిటీ(ఛోటా టోలీ) ఢిల్లీలో సమావేశం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్, పార్టీ ముఖ్య నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అమిత్​షాతో భేటీ కానున్నారు.  సంజయ్ తోపాటు మరికొందరు నేతలు సోమవారమే ఢిల్లీ వెళ్లగా.. మిగిలిన వారు మంగళవారం ఉదయం బయల్దేరి వెళ్లనున్నారు. లిక్కర్ స్కాంలో వరుస అరెస్టుల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేత ఒకరు ఈ స్కాంలో త్వరలో అరెస్టు అవుతారనే ప్రచారం సాగుతోంది. ఈ భేటీలో లిక్కర్​స్కాంపైనే ప్రధానంగా చర్చ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కార్నర్​ మీటింగ్స్ పక్కన పెట్టి.. ఢిల్లీకి

మంగళవారమే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేశారు. మినీ కోర్​ కమిటీలోని కీలక నేతలు కూడా కొన్ని సభలకు చీఫ్ గెస్టులుగా హాజరుకావాల్సి ఉంది. కానీ, సోమవారం ఉదయమే అమిత్ షా ఆఫీసు నుంచి రాష్ట్ర నేతలకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. కార్నర్​ మీటింగ్స్​సభలు ఉన్నాయని చెప్పినా.. వాటిని వేరే నేతలకు అప్పగించాలని హైకమాండ్ చెప్పడంతో వేరే వారికి ఆ బాధ్యతలు అప్పగించారు. మీటింగ్ ఎజెండా ఏమిటనే విషయాన్ని రాష్ట్ర నేతలకు చెప్పకపోయినా.. అత్యవసరమైన ఎజెండాపైనే మీటింగ్ ఉంటుందనే సంకేతాలను ఢిల్లీ పెద్దలు ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు చేపడుతున్న ప్రోగ్రామ్ ల గురించి కూడా అమిత్ షా రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకోనున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కు వస్తున్న స్పందన, పార్లమెంటరీ ప్రవాసీ యోజన మీటింగ్స్​కు జనం రెస్పాన్స్ వంటి విషయాలపైనా ఆయన ఆరా తీయనున్నారు.

యధావిధిగా ‘స్ట్రీట్ కార్నర్’ముగింపు సభలు

కీలక నేతలు ఢిల్లీ వెళ్లినప్పటికీ, మంగళవారం 119 నియోజకవర్గాల్లో జరగాల్సిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ముగింపు సభలు యధావిధిగా నిర్వహిస్తామని బీజేపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఢిల్లీ వెళ్లిన నేతలకు అప్పగించిన నియోజకవర్గాల్లోని సభకు ఇతర సీనియర్ నేతలు హాజరవుతారని తెలిపారు. కాగా, వనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఇంద్రసేనారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.