ప్రతీ మహిళకు రూ.2,100 మహారాష్ట్ర సంకల్ప్ పత్రంలో బీజేపీ హామీ

ప్రతీ మహిళకు రూ.2,100 మహారాష్ట్ర సంకల్ప్ పత్రంలో బీజేపీ హామీ

ముంబై: మహారాష్ట్రను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్​గా మారుస్తామని, ‘లాడ్కీ బహిన్’ పేరుతో మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.1,500 నుంచి2,100కు పెంచుతామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. నిత్యావసర సరుకుల ధరలు కంట్రోల్ చేస్తామని అన్నారు. ‘సంకల్ప్ పత్ర్ 2024’ పేరుతో 25 కీలక హామీలతో కూడిన మేనిఫెస్టోను అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్తాం. మహయుతి ప్రభుత్వం మహిళలు, పేదలు, రైతుల గౌరవం కోసం పని చేసింది. 

మత మార్పిడి నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య గణన చేపడ్తాం. అక్షయ అన్న యోజన కింద ప్రతీ పేద కుటుంబానికి ఫ్రీ రేషన్ అందజేస్తం. 25 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తాం. 10 లక్షల మంది స్టూడెంట్లకు నెలకు రూ.10 వేల స్టయిఫండ్ అందజేస్తాం. 45 వేలకు పైగా గ్రామాలకు కొత్త రోడ్లు వేస్తాం. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెడ్తాం. కరెంట్ బిల్లు 30% తగ్గేలా చూస్తాం’’ అని అమిత్ షా హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ఇచ్చే హామీలు నమ్మొద్దు

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తమ మేనిఫెస్టోను తయారుచేశామని అమిత్​ షా తెలిపారు. ఎన్నో ఏండ్ల నుంచి మహారాష్ట్ర అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నదని చెప్పారు. భక్తి ఉద్యమం సహా అనేక ఉద్యమాలకు వేదికైందని అన్నారు. రాష్ట్ర ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు శివాజీ మహారాజ్ ఇక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సామాజిక విప్లవం కూడా మహారాష్ట్ర నుంచే షురూ అయిందని తెలిపారు. ‘‘కాంగ్రెస్ నాయకులారా.. హామీలు ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఇష్టమొచ్చినట్లు గ్యారంటీలు ఇవ్వొద్దు. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను తెలుసుకోకుండా నెరవేర్చలేని హామీలివ్వడం సరికాదు. 

ప్రభుత్వం ఏర్పాటు చేశాక .. ఇచ్చిన హామీలపై మాట మార్చొద్దు. హిమాచల్, తెలంగాణ, కర్నాటకతో పాటు చాలా రాష్ట్రాల్లో గ్యారంటీలు అమలు చేయలేదు’’ అని కాంగ్రెస్​పై అమిత్ షా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమిగా పోటీ చేస్తున్నాయి.

మా లక్ష్యం ‘విజన్ మహారాష్ట్ర @ 2028”

‘విజన్ మహారాష్ట్ర @ 2028”లక్ష్యంగా పనిచేస్తామని అమిత్ షా తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మహారాష్ట్రను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరంలో 435 బిలియన్ డాలర్లతో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన స్టేట్​గా మహారాష్ట్ర నిలిచింది. రాష్ట్రాన్ని అడ్వాన్స్​డ్ రోబోటిక్, ఏఐ ట్రైనింగ్​ హబ్​గా అభివృద్ధి చేస్తాం. నాగ్​పూర్, నాసిక్​, పుణెలను ఎయిరోస్పేస్ హబ్​లుగా మారుస్తాం. 2027 నాటికి 50 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి అండగా ఉంటాం. ఎరువుల కొనుగోళ్లపై ఎస్జీఎస్టీని రైతులకు తిరిగి చెల్లిస్తాం’’ అని అమిత్ షా చెప్పారు.