- రాహుల్ గాంధీ ఎన్ని ర్యాలీలు చేసినా చొరబాటుదారులను ఏరేస్తం
- ఆర్జేడీ పాలనలో హత్యలు, దోపిడీలు.. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో నేరాలు తగ్గుముఖం
- బిహార్‌ను మోదీ, నితీశ్ మాత్రమే అభివృద్ధి చేయగలరని వెల్లడి
పాట్నా: బిహార్ ప్రజలు జంగల్ రాజ్ (ఆటవిక పాలన) పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి కావాలా? లేక ఆటవిక పాలన కావాలా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని చెప్పారు. శనివారం బిహార్‌లోని ఖగారియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు తెలివిగా ఓటేయాలని, అభివృద్ధినే ఎంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘మీకు మళ్లీ జంగల్‌రాజ్ కావాలా? లాలూ రబ్రీ సర్కారు గనుక వస్తే.. దాంతోపాటే జంగల్ రాజ్ వస్తుంది. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే దేశమంతటా అభివృద్ధి చెందిన బిహార్‌గా గుర్తింపు పొందుతుంది” అని పేర్కొన్నారు.
బిహార్‌ను నక్సలిజం నుంచి విముక్తి చేసేందుకు తాము పనిచేశామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ.. 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి తీసుకెళ్లారని, 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. విదేశీ కుట్రలనుంచి దేశాన్ని భద్రంగా కాపాడే కెపాసిటీ ఒక్క మోదీకే ఉందన్నారు.
చొరబాటుదారులకు రాహుల్ సపోర్ట్
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో చొరబాటుదారులకు సపోర్ట్ చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను ఇండియా బ్లాక్ వ్యతిరేకించిందని మండిపడ్డారు. ‘‘చొరబాటుదారులను కాపాడేందుకు రాహుల్ గాంధీ ఎన్ని యాత్రలైనా చేసుకోనివ్వండి.
ఏం చేసినా.. వారిని ఆయన రక్షించలేరు. ప్రతి ఒక్క చొరబాటుదారుడిని గుర్తిస్తం. ఓటరు జాబితా నుంచి పేరును తొలగించి వారి స్వదేశానికి పంపిస్తం” అని పేర్కొన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కేవలం తన కుటుంబ ప్రయోజనాలపైనే దృష్టి సారించారని, వారివి వారసత్వ రాజకీయాలని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నీతీశ్ కుమార్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.
ఆర్జేడీ పాలనలో హత్యలు, దోపిడీలు యథేచ్ఛగా జరిగాయని, కానీ.. ఎన్డీయే హయాంలో నేరాల సంఖ్య పూర్తిగా తగ్గాయని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రజలు జంగల్‌రాజ్ తిరిగి రావాల కోరుకోవడం లేదని అమిత్ షా అన్నారు.
