ఇయ్యాల చేవెళ్లలో అమిత్​ షా సభ

ఇయ్యాల చేవెళ్లలో అమిత్​ షా సభ
  • ఇయ్యాల చేవెళ్లలో
  • అమిత్​ షా సభ
  • లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేస్తున్న బీజేపీ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంటరీ ప్రవాస్ యోజనలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించనున్న విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సాయంత్రం ఆరు గంటలకు చేవెళ్ల చేరుకోనున్న అమిత్ షా.. గంట పాటు సభలో ఉంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మురళీధర్ రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరవుతారు.

పార్లమెంటరీ ప్రవాస్ యోజనలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి బహిరంగ సభకు అమిత్ షా వస్తుండడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది. కనీసం లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏర్పాట్లపై శనివారం బండి సంజయ్.. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, చేవెళ్లకు దగ్గరగా ఉన్న పలు ఉమ్మడి జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి నేరుగా చేవెళ్లకు


ముందే నిర్ణయించిన షెడ్యూల్​ప్రకారం అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఎయిర్​పోర్టు సమీపంలోని నోవాటెల్‌‌‌‌‌‌‌‌కు 3.50 గంటలకు చేరుకుని, సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్‌‌‌‌‌‌‌‌తో భేటీ అవ్వాల్సి ఉంది. అక్కడే సాయంత్రం 5.10 వరకు విశ్రాంతి తీసుకుంటారని షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నా.. ఆ సమయంలో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అమిత్​షా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలు మార్పులు చేస్తూ శనివారం రాత్రి మళ్లీ షెడ్యూల్ ఇచ్చారు. సవరించిన షెడ్యూల్​ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్​ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 6 గంటలకు చేవెళ్ల సభకు చేరుకుంటారు. గంట పాటు సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు చేవెళ్ల నుంచి బయల్దేరి 7.45 గంటలకు శంషాబాద్​ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. 7.50కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి బయల్దేరుతారు. షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో మార్పుల కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టీమ్‌‌‌‌‌‌‌‌తో భేటీ రద్దయింది. అలాగే పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన సమావేశం కూడా రద్దు చేశారు.