తెలంగాణలో ఎదుగుతున్నం

తెలంగాణలో ఎదుగుతున్నం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో చేస్తున్న పోరాటాలతో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​​కు సూచించారు. మంగళవారం ఢిల్లీలో అమిత్​ షాతో బండి సంజయ్​ భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, కేంద్రాన్ని బద్నాం చేసేందుకు టీఆర్ఎస్ సర్కారు ఆడుతున్న డ్రామాలను సంజయ్ ఆయనకు వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, ఈ సమయంలో బీజేపీ రాష్ట్ర శాఖ చేపడుతున్న కార్యక్రమాలు సక్సెస్​ అవుతున్నాయని షా అభినందించారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింతగా పోరాడాలని సూచించారు. ప్రజా సంగ్రామ యాత్రపై కూడా చర్చించారు. ఏప్రిల్ 14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాలని అమిత్ షాను సంజయ్​ ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ఆయన.. యాత్ర షెడ్యూల్ అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర ముగింపు సభ హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గంలో ప్లాన్ చేస్తున్నామని సంజయ్ చెప్పడంతో.. ఆ రోజు తప్పకుండా రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టడం మంచి పరిణామమని సంజయ్​ను అభినందించారు.

జేపీ నడ్డాతోనూ సమావేశం

ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ నేషనల్​ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సంజయ్​ చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న ఉద్యమాల పట్ల నడ్డా సంతృప్తి వ్యక్తం చేశారు. వీలు చూసుకుని పాదయాత్రకు హాజరవుతానని చెప్పారు. ‘మీ పోరాటం భేష్.. ఇలాగే కొనసాగించండి.. మీ వెంట మేమున్నాం’ అంటూ సంజయ్​కు నడ్డా భరోసా ఇచ్చారు.