రాజస్థాన్ సీఎం గెహ్లాట్ .. రాజీనామా చెయ్యాలె

రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ..  రాజీనామా చెయ్యాలె

జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. శనివారం గంగాపూర్ సిటీలో నిర్వహించిన ‘సహకార్ కిసాన్ సమ్మేళన్’లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది నినాదాలు చేయగా.. అమిత్ షా ఫైర్ అయ్యారు. ‘‘గెహ్లాట్ సాబ్.. నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఇలా కొంతమందిని పంపించి నినాదాలు చేయిస్తే, మీరేం సాధించలేరు. కొన్ని రోజులుగా రెడ్ కలర్ అంటేనే గెహ్లాట్ వణికిపోతున్నారు. రెడ్ డైరీలో రాజస్థాన్ 
ప్రభుత్వ అక్రమాలన్నీ ఉన్నాయి. గెహ్లాట్​కు ఏమాత్రం సిగ్గూశరం ఉన్నా, వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి” అని సవాల్ విసిరారు. 

అగ్రికల్చర్ బడ్జెట్ ఆరు రెట్లు పెంచినం.. 

గత ప్రభుత్వాలు చేయని ఎన్నో పనులను తాము చేస్తున్నామని అమిత్ షా అన్నారు. అగ్రికల్చర్ బడ్జెట్ ను ఆరు రెట్లు పెంచామని, సెపరేట్ గా కోఆపరేటివ్ మినిస్ట్రీని ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అగ్రికల్చర్ బడ్జెట్ కేవలం రూ.22 వేల కోట్లు కాగా, తాము దాన్ని తొమ్మిదేండ్లలో రూ.1.25 లక్షల కోట్లకు పెంచామని పేర్కొన్నారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అమిత్ షా దేశంలో కోఆపరేటివ్ విప్లవం తీసుకొస్తున్నారని కొనియాడారు. అవినీతిని అంతం చేసే, రైతులకు సున్నా వడ్డీ రుణాలిచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.