
చక్రధర్పూర్ (జార్ఖండ్): వచ్చే జనరల్ ఎలక్షన్స్లోపు దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్సీ అమలుచేసి, దేశంలోకి అక్రమంగా చొరబడిన ప్రతి ఒక్కరినీ వెనక్కు పంపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించేస్తామని తాము అంటుంటే.. వాళ్లను వెళ్లగొడితే ఎక్కడికి వెళతారు, ఏం తింటారని రాహుల్ బాబా ప్రశ్నిస్తున్నాడని షా విమర్శించారు. ఎవరు అడ్డుకున్నా 2024లోగా ఈ ప్రక్రియను మొత్తం పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చక్రధర్పూర్, బహరాగోరాలో జరిగిన సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎంత ముఖ్యమో, టెర్రరిజం రూపుమాపడం, నక్సలిజం, రామ మందిర నిర్మాణం వంటి జాతీయ అంశాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాల ప్రస్తావన ఎందుకన్న కాంగ్రెస్ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అయోధ్య కేసులో విచారణే అక్కర్లేదని కాంగ్రెస్ నేతలు కోర్టుకు చెప్పారు.. కానీ ప్రజలిచ్చిన ధైర్యంతో బాబ్రీ కేసు విచారించాల్సిందేనని తమ సర్కారు కోర్టును కోరిందన్నారు. దీంతో అయోధ్యలో రాముడి గుడి మాత్రమే కట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఎన్‌ఆర్సీ అమలు చేయడంవల్లే పశ్చిమ బెంగాల్లో జరిగిన బైపోల్స్‌లో బీజేపీ నష్టపోయిందన్న కామెంట్స్‌ను ఆయన కొట్టిపారేశారు. జార్ఖండ్‌లో బీజేపీని ఓడించేందుకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి కట్టిందని అమిత్ షా విమర్శించారు. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం స్టూడెంట్లపై కాల్పులు జరిపించింది.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో జేఎంఎం లీడర్ హేమంత్ సోరన్ చేతులు కలిపారని మండిపడ్డారు. రాష్ట్రంలో రఘువర్ దాస్ ఐదేళ్ల పాటు అవినీతిరహిత పాలన అందించారని మెచ్చుకున్నారు. ‘55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఏంచేశారో రాహుల్ చెప్పాలి.. 5 ఏళ్లలో ఏంచేశామో మేము చెప్తాం’ అని అమిత్ షా సవాల్ విసిరారు.