
గతకొన్ని రోజులుగా విధికుక్కలపై దేశం మొత్తం పెద్ద చర్చ జరగ్గా, దీని పై సుప్రీం కోర్ట్ కీలక ఆర్డర్ జారీ చేసిన సంగతి మీకు తెలిసి ఉంటుంది. అయితే విధికుక్కల సమస్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ, ఇప్పటికి ఇంకా కొన్ని చోట్ల కుక్కకాట్లు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ డోంబివ్లి పరిసరాల్లో ఒకే రోజులో 67 మంది వీధికుక్క కాటు బారిన పడ్డారు. దింతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన, భయంతో బాధపడుతున్నారు. కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో కుక్కకాటు ఘటనలు అక్కడక్కడ జరుగుతున్నా, ప్రస్తుతం రోజుకు పదుల సంఖ్యాలో కేసులు నమోదవుతున్నాయి.
నిన్న శనివారం కళ్యాణ్ & డోంబివ్లి సిటీ నుండి 67 కుక్క కాటు కేసులు నమోదయ్యాయని స్థానిక వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ దీపా శుక్లా తెలిపారు. అయితే ఒక్కసారిగా కేసులు పెరగడంతో స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రద్దీ ఏర్పడింది.
కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కెడిఎంసి) పరిధిలో వీధికుక్కల సమాస్య కారణంగా ఈ సంఘటనలు భారీగా పెరిగాయి. రోగులందరికీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లతో సహా అవసరమైన చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వీధికుక్కలను నియంత్రించడానికి కెడిఎంసి క్రమం తప్పకుండా స్టెరిలైజేషన్ డ్రైవ్స్ నిర్వహిస్తోందని చెప్పారు.
ప్రతి నెలా 1,000 నుంచి 1,100 కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఆమె చెప్పారు. అంతేకాకుండా, కెడిఎంసి కార్పొరేషన్ కుక్క కాటుకి అవసరమైన రేబిస్ నివారణ మందులను అందుబాటులో ఉంచారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను మరింత మెరుగుపరచడానికి, మరో ప్రత్యేక కుక్కల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారని తెలిపారు. ప్రజల భద్రతను కాపాడటానికి వెంటనే, తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రాంత ప్రజలు కోరుతున్నారు.