బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా

బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా

సిద్దిపేట: దేశంలో బీజేపీకి 405కిపైగా  సీట్లు వస్తాయని, మోదీ మూడో సారి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 12 సీట్లు గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని కోరారు. పదేండ్లలో దేశవ్యాప్తంగా జఠిలమైన సమస్యలను పరిష్కారానికి కృషి చేశామని అన్నారు. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మోదీ ఎంతో కృషి చేశారన్నారు. రామ మందిరం కట్టవద్దన్న ఆలోచనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఉండేదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని, రెండు పార్టీలు తెలంగాణలో అవినీతికి పాల్పడ్డాయని అన్నారు. బీఆర్ఎస్ చేసిన ఏ ఒక్క అవినీతినీ కాంగ్రెస్ వెలుగులోకి తేలేదని అన్నారు.  

తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన అతి తక్కువ సమయంలోనే ఢిల్లీకి ఏటీఎంలా మారిందని పేర్కొన్నారు.  మూడో సారి మోదీ ప్రధాని కాగానే తెలంగాణలో అవినీతి కనుమరుగవుతుందని అన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వనున్నట్టు అమిత్ షా చెప్పారు.