
న్యూఢిల్లీ: సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ) విషయంలో కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా ఆరోపించారు. వారు అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో షా మాట్లాడుతూ.. సిటిజన్‌షిప్ పోతుందని మైనారిటీలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చారు. మన పొరుగున ఉన్న మూడు దేశాలలో మతపరంగా అణిచివేతకు గురవుతున్న మైనారిటీలకు సిటిజన్‌షిప్ ఇచ్చి, వారిని ఆదుకోవడానికే చట్టానికి సవరణలు చేసినట్లు షా స్పష్టం చేశారు. అంతేకానీ దేశంలోని పౌరుల నుంచి సిటిజన్‌షిప్ రద్దు చేయడం దీని ఉద్దేశం కాదన్నారు. బీజేపీ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చి సీఏఏకు మద్దతు తెలపాలని అమిత్ షా కోరారు. నాన్కానా సాహెబ్ గురుద్వారాపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. సిక్కులను భయాందోళనలకు గురి చేస్తోందని పాక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పొరుగు దేశంలోని మైనారిటీల పరిస్థితి చూసి కళ్లు తెరవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. సీఏఏను నిరసిస్తున్న వారు పాక్‌లోని సిక్కులను ఎక్కడికి పొమ్మంటారో చెప్పండని ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పైనా షా విమర్శలు గుప్పించారు. ప్రజల సొమ్మును యాడ్స్‌పై కేజ్రీవాల్ వృథా చేస్తున్నారని విమర్శించారు.