అమిత్ షా పర్యటన రద్దు : గుజరాత్ తుఫాన్ ఎఫెక్ట్

అమిత్ షా పర్యటన రద్దు : గుజరాత్ తుఫాన్ ఎఫెక్ట్

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. జూన్ 15వ తేదీ ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. హైదరాబాద్ లోని పలువురు ప్రముఖులతో భేటీ కావటంతోపాటు.. భద్రాచలంలో రాములోరి దర్శనం.. ఆ తర్వాత ఖమ్మంలోని భారీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. తెలంగాణలో ఒక రోజు పూర్తి పర్యటన చేయాల్సిన ఆయన.. తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 

గుజరాత్ రాష్ట్రంలో బిపర్ జాయ్ తుఫాన్ తీరం దాటనుంది. జూన్ 15వ తేదీ మధ్యాహ్నం తీరదాటనున్న తుఫాన్.. తీవ్ర ప్రభావం చూపనుంది. తీరం దాటిన తర్వాత అతి భారీ వర్షాలు పడతాయని.. వరదలు వస్తాయని.. విద్యుత్ సరఫరా ఉండదని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అక్కడ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించటానికి.. బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటంలో భాగంగా.. అమిత్ షా తన పర్యటన రద్దు చేసుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై సమీక్షల క్రమంలోనే.. తెలంగాణ పర్యటన వాయిదా పడింది. 

అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు సమాచారం రావటంతో.. ఖమ్మంలోని బీజేపీ రాష్ట్ర నేతలు అందరూ హైదరాబాద్ తిరుగు పయనం అయ్యారు. మళ్లీ అమిత్ షా టూర్ ఎప్పుడు ఉంటుందనేది ఇప్పటి అయితే ప్రకటించలేదు. త్వరలో మళ్లీ కొత్త టూర్ షెడ్యూల్ రానున్నట్లు చెబుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.