అమిత్ షా టూర్ షెడ్యూల్

అమిత్ షా టూర్ షెడ్యూల్
  • రాత్రి పోలీసు అకాడమీలో బస
  • రేపు పరేడ్​ గ్రౌండ్​లో విమోచన వేడుకలకు హాజరు
  • అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో భేటీ

హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల రాష్ట్ర టూర్ షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. శుక్రవారం రాత్రి 9.50 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి తెలంగాణ పోలీసు అకాడమీలో బస చేస్తారు. శనివారం ఉదయం 8.45 నుంచి 11.10 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే విమోచన వేడుకల్లో  పాల్గొంటారు. అనంతరం ఉదయం11.20 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బేగంపేట హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.30 గంటల వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ప్రధాని మోడీ బర్త్​డే వేడుకల్లో దివ్యాంగులకు  ఉపకరణాలను అందిస్తారు. అక్కడి నుంచి మళ్లీ పోలీసు అకాడమీకి వెళ్లనున్న అమిత్ షా.. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7. 30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. 

నేడు స్మృతి కేంద్రాల వద్దకు బీజేపీ నేతలు 
నిజాం వ్యతిరేక పోరాటంలో అశువులు బాసిన అమరవీరుల స్మృతి కేంద్రాలను ఇయ్యాల బీజేపీ నేతలు సందర్శించి నివాళి అర్పించనున్నారు. ఏ జిల్లాకు ఎవరెవరు వెళ్లాలనే వివరాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం గురువారం ప్రకటించింది. వరంగల్ జిల్లా పరకాలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు  వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు. కరీంనగర్ హుస్నాబాద్ మండలం మమ్దాపురంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ ఖిల్లాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిర్మల్​లో వెయ్యి ఉరుల మర్రి చెట్టు వద్ద, కుమ్రం భీమ్ జోడేఘాట్ వద్ద ఎంపీ సోయం బాపూరావు, సిద్దిపేట జిల్లా బైరాన్ పల్లిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఖమ్మంజిల్లా ఎర్రుపాలెంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నల్లగొండ జిల్లా గుండ్రంపలిల్లో బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్​చార్జీ మురళీధర్​రావు, మహబూబ్ నగర్ జిల్లా అప్పన్నపల్లిలో బీజేపీ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, హైదరాబాద్ కాచిగూడలో షోయుబుల్లా ఖాన్ విగ్రహం వద్ద బీజేపీ జాతీయ నాయకురాలు విజయశాంతి నివాళి అర్పించనున్నారు.