అక్టోబర్ 7న మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల  సీఎంలతో అమిత్ షా భేటీ

 అక్టోబర్ 7న మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల  సీఎంలతో అమిత్ షా భేటీ
  • పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న రాష్ట్రాల సీఎంలు, సీఎస్ లు, డీజీపీలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, బిహార్, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు, సీఎస్ లు, డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సాయాన్ని అందిస్తున్న మరో ఐదు కేంద్ర శాఖల మంత్రులతోపాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో నక్సల్స్ ఏరివేత, తాజా పరిస్థితులు, అభివృద్ధి ఇతర అంశాలపై చర్చించనున్నారు‌‌‌‌‌‌‌‌. కాగా, 2026 మార్చి నాటికి భారత్ ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామని ఇటీవల హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ దిశలో గత పదేళ్లలో నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లను కేంద్రం చేపట్టింది. అలాగే యువత, కొత్తవారు నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. సెప్టెంబర్ 20న ఢిల్లీలో చత్తీస్ గఢ్ కు చెందిన 55 మంది మావోయిస్టు బాధితులతో అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2026, మార్చి 31వ తేదీ మావోయిస్టులకు చివరి రోజు. అప్పటికి వామపక్ష తీవ్రవాద రహిత భారత్ ను చూస్తాం. బస్తర్ మళ్లీ అందంగా, శాంతియుతంగా మారుతుంది”అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు అనుగుణంగానే గత శుక్రవారం నారాయణ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌- దంతేవాడ అడవుల్లో జరిగిన భారీ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. 

280 రోజుల్లో 202 మంది మృతి.. 

ప్రస్తుతం వామపక్ష తీవ్రవాదం కొన ఊపిరితో ఉందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా లెక్కలే ఇందుకు నిదర్శనమని తెలిపింది. గడిచిన 280 రోజుల్లో (ఈ ఏడాది అక్టోబర్ 5 వరకు) జరిగిన ఎన్ కౌంటర్లలో 202 మంది నక్సల్స్ మృతిచెందారని ప్రకటించింది. అలాగే ఈ ఏడాది 723 మంది మావోయిస్టులు లొంగిపోగా, 812 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఇక 2010తో పోల్చితే మావోయిస్టులు చేపట్టిన హింసాత్మక ఘటనలు72 శాతం మేరకు తగ్గాయని.. హింస కారణంగా చనిపోయినవారి సంఖ్య కూడా 86 శాతం తగ్గిందని కేంద్రం తెలిపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కి.మీ. పొడవైన రోడ్లతోపాటు 6,000 మొబైల్ టవర్లు నిర్మించినట్టు వివరించింది. 

భేటీలో పాల్గొననున్న సీఎం రేవంత్ 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ ఆదివారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కొనసాగుతుండడం, మరోవైపు వచ్చే ఏడాది మార్చి నాటికి వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా భారత్ ను ప్రకటించాలని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో కూడా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి కొండా సురేఖ కామెంట్స్, హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తూ ఆర్డినెన్స్, మూసీ రివర్ డెవలప్మెంట్, ఇతర రాజకీయ అంశాలను హైకమాండ్ కు సీఎం వివరించనున్నారని సమాచారం.