- గోపాల్‌గంజ్, సమస్తిపూర్, వైశాలీలో ప్రజలను ఉద్దేశించి వర్చువల్‌గా ఎన్నికల ప్రచారం
- మహిళలు, రైతులకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చామని షా వెల్లడి
- లాలూ హయాంలో కిడ్నాపింగ్ ఒక బిజినెస్
- కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శ
పాట్నా/ న్యూఢిల్లీ: ఎన్డీయే చేస్తున్న అభివృద్ధి కొనసాగాలో.. ఆర్జేడీ ఆటవిక పాలనా కావాలో బిహార్ ప్రజలే తేల్చుకోవాలని కేంద్రమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ అధికారంలోకి వస్తే బిహార్‌లో అరాచకాలు మళ్లీ పెరిగిపోతాయని ప్రజలను హెచ్చరించారు. ఈ ఎలక్షన్ బిహార్ భవిష్యత్తును ఎవరికి అప్పగించాలో నిర్ణయించే అవకాశమిచ్చిందని.. ఎన్డీయేను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బిహార్‌లో పర్యటించిన అమిత్ షా.. వాతావరణం అనుకూలించకపోవడంతో గోపాల్‌గంజ్, సమస్తిపూర్, వైశాలీ జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు వెళ్లలేకపోయారు. అయినా, సభలకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు."గోపాల్‌గంజ్ ప్రజలు 2002 నుంచి ఆర్జేడీకి ఎప్పుడూ ఓటు వేయలేదు.
ఈసారి కూడా అదే ధోరణిని కొనసాగిస్తారని నాకు నమ్మకం ఉంది. బిహార్ మాజీ సీఎం రబ్రి దేవి సోదరుడు సాధు యాదవ్ చేస్తున్న దుర్మార్గాలు గోపాల్‌గంజ్ ప్రజలకు తెలుసు. అతడిని ఓడించాలి. ఎన్డీయే మేనిఫెస్టోలో రెండు ప్రధాన విషయాలున్నాయి. - రైతుల కోసం ఒకటి, మహిళల కోసం మరొకటి. ఇటీవల సీఎం నీతిశ్ కుమార్, ప్రధాని మోదీ1.41 కోట్ల మహిళల ఖాతాల్లో రూ.10,000 చొప్పున జమ చేశారు. భవిష్యత్తులో వివిధ మార్గాల్లో 2 లక్షల వరకు జమ చేయనున్నాం.
అలాగే, బిహార్‌లోని 27 లక్షల రైతులకు ఏడాదికి రూ.6,000 ఇస్తున్నాం. ఇప్పుడు, మరో రూ.3,000 జోడించి రూ.9,000 ఇవ్వనున్నాం. రాష్ట్రంలోని అన్ని షుగర్ మిల్లులను తిరిగి ప్రారంభిస్తాం" అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ను విమర్శిస్తూ.." రాహుల్ గాంధీ ఎన్ని యాత్రలు చేపట్టినా సరే ప్రతి చొరబాటుదారుడిని దేశం నుంచి తరిమికొడతాం" అని షా ఆరోపించారు.
ఆర్జేడీ వస్తే మళ్లీ 'జంగల్ రాజ్': నడ్డా
బిహార్ లో మళ్లీ 'జంగల్ రాజ్'ను తీసుకురావాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన మహమ్మద్ షహాబుద్దీన్ కొడుకును ఆర్జేడీ తన అభ్యర్థిగా నిలబెట్టడమే అందుకు నిదర్శనమన్నారు. శనివారం ఆయన సీవాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, మాట్లాడారు. "గత లాలూ ప్రసాద్ యాదవ్ పాలనంతా ఆటవిక పాలనలా సాగింది.
లాలూ హయాంలో కిడ్నాపింగ్ ఒక బిజినెస్ గా మారింది. న్యాయం, చట్టం క్రమంగా కుప్పకూలాయి. సీవాన్ ప్రజలను షహాబుద్దీన్ తీవ్రంగా హింసించాడు. అలాంటి వ్యక్తి కొడుకైన ఒసామా షహాబ్‌ను ఇప్పుడు ఆర్జేడీ అసెంబ్లీ పోల్స్‌లో అభ్యర్థిగా నిలబెట్టింది. అతను గెలిస్తే సీవాన్‌లో బలవంతపు వసూలు, దాదాగిరి, బెదిరింపు పెరిగిపోతాయి. మోదీ, సీఎం నీతిశ్ కుమార్ నేతృత్వంలో బిహార్ ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగాలంటే ఎన్డీయేకు మాత్రమే ఓటు వేయండి" అని ప్రజలకు నడ్డా విజ్ఞప్తి చేశారు.
