
పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించిన బీజేపీ.. క్లస్టర్ల మీటింగ్ లతో హోరెత్తిస్తోంది. ఇవాళ నిజమాబాద్ లో 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన క్లస్టర్ల సమావేశం జరగనుండగా.. బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న బీజేపీ.. నోటిఫికేషన్ రాకముందే ప్రచారాలు మొదలుపెట్టింది. ఇక నేతలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేసేందుకు ప్రతీ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నెల 5న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ క్లస్టర్ సమావేశంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బిజెపి….భువనగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల సమావేశాలు పూర్తి చేసింది.
ఇవాళ నిజామాబాద్ లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తారని.. రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్.
బీజేపీ కి ప్రస్తుతం తెలంగాణలో ఒకే ఎంపీ సీటు ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లను పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఒంటరిగా బరిలోకి దిగుతోంది బీజేపీ. గత నాలుగున్నరేండ్లుగా నరేంద్రమోడీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు రాష్ట్ర నేతలు. మోడీ సర్కార్ లో లబ్ధి పొందిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.