బీజేపీ ఎక్కడ పోటీ చేస్తే.. అక్కడ ఓట్ చోరీ పక్కా: రాహుల్ గాంధీ

బీజేపీ ఎక్కడ పోటీ చేస్తే.. అక్కడ ఓట్ చోరీ పక్కా: రాహుల్ గాంధీ

పాట్నా: ఓట్ చోరీ‎పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలపై డోస్ పెంచుతున్నారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని.. లేకుంటే 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేదని ఆధారాలతో సహా బీజేపీ, ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి ఓట్ చోరీ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ, ఈసీపై విమర్శల వర్షం కురిపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం (నవంబర్ 6) పూర్నియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ఈసీతో కలిసి బీజేపీ ఓటు చోరీలో మునిగిపోయిందని తన ఆరోపణలను పునరుద్ఘాటించారు.

 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఈసీ కలిసి ఓట్లు దొంగలిచాయనే విషయాన్ని మొత్తం ప్రపంచానికి చూపించామన్న రాహుల్.. ఇప్పుడు  బీహార్‌లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓట్లను దొంగిలించడానికి ప్రయత్నిస్తారని సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ చోరీ ఆపడం, రాజ్యాంగాన్ని కాపాడటం ఇప్పుడు బీహార్ యువత బాధ్యత అని.. మీరందరూ పోలింగ్ బూత్‌ల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

మోడీ, నితీష్‎పై ఫైర్:

ప్రధాని మోడీ, సీఎం నితీష్ కుమార్‎పైన రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సీఎం నితీష్ కుమార్ బీహార్ యువతను కార్మికులుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రభుత్వాన్ని ఢిల్లీకి చెందిన బ్యూరోక్రాట్లు నడుపుతున్నారని ఆరోపించారు. బీహార్ ప్రభుత్వాన్ని నితీష్ కుమార్ నడపడం లేదని.. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రధాని మోడీ, అమిత్ షా నడుపుతున్నారని అన్నారు. 

బీహార్ మళ్లీ అభివృద్ధి చెందాలని.. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ఇక్కడ స్థాపించబడాలని ఆకాంక్షించారు. బీహార్ ప్రపంచ పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా మారాలని.. కానీ ప్రధాని మోడీ, సీఎం నితీష్ కుమార్ దీన్ని చేయలేరని విమర్శించారు.