ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ ఉంచకపోయినా బౌలింగ్ లో అదరగొట్టి కంగారులను చిత్తు చేసింది. గురువారం (నవంబర్ 6) క్వీన్స్‌ల్యాండ్ లో కర్రారా ఓవల్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 48 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లారు. మొదట బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్ లో అత్యద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.
ఒక మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, షార్ట్ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్ కు 37 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. షార్ట్ మెరుపులతో ఆస్ట్రేలియా పవర్ ప్లే లో 48 పరుగులు చేసింది. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి షార్ట్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. పవర్ ప్లే తర్వాత ఆస్ట్రేలియా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వస్తుంది. మార్ష్ (30), ఇంగ్లిష్ (12) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఆదుకుంటాడనుకున్న టిమ్ డేవిడ్ 14 పరుగులే చేసి ఔటవ్వడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
మార్కస్ స్టోయినిస్ ను సుందర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడం.. గ్లెన్ మ్యాక్స్ వెల్ ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఇండియా వైపు మళ్లింది. 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఛేజింగ్ లో ముందుకు సాగలేకపోయింది. టైలాండర్స్ జేవియర్ బార్ట్‌లెట్, బెన్ ద్వార్షుయిస్, ఆడమ్ జంపా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా 119 పరుగులకే ఆలౌటైంది. ఇండియా బౌలర్లలో వాషింగ్ టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబే, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా లకు తలో వికెట్ లభించింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమాన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ (28), సూర్య కుమార్ యాదవ్ (20) కొన్ని మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్, జంపా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. బార్ట్ లెట్, మార్కస్ స్టోయినిస్ లకు తలో ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఓపెనర్లు శుభమాన్ గిల్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే లో పరుగుల వేగం తగ్గింది. దీంతో తొలి 6 ఓవర్లలో 49 పరుగులు రాబట్టి పర్వాలేదనిపంచింది. తొలి వికెట్ కు 55 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ (28) భారీ షాట్ కు ప్రయత్నించి జంపా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో గిల్ కు జత కలిసిన శివమ్ దూబే టీమిండియా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 32 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశారు.
దూబే ఔటైనా సూర్య, గిల్ కలిసి పర్వాలేదనిపించారు. భారీ స్కోర్ ఖాయమనుకుంటే ఒక్కసారి కుదేలయ్యారు. హాఫ్ సెంచరీకి సమీపంలో ఉన్న గిల్ ను ఎల్లిస్ క్లీన్ బౌల్డ్ చేస్తే.. వెంటనే సూర్యను బార్ట్ లెట్ పెవిలియన్ కు చేర్చాడు. మూడో టీ20లో సత్తా చాటిన జితేష్ శర్మను జంపా కేవలం 3 పరుగులకే ఔట్ చేశాడు. తిలక్ వర్మ కూడా సింగిల్ డిజిట్ కే ఔట్ కావడంతో ఇండియా 136 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో అక్షర్ పటేల్ (21) కొన్ని మెరుపులు మెరిపించి జట్టు స్కోర్ ను 160 పరుగుల మార్క్ కు చేర్చారు.
Washington Sundar wraps things up in style 👌
— BCCI (@BCCI) November 6, 2025
A terrific performance from #TeamIndia as they win the 4⃣th T20I by 4⃣8⃣ runs. 👏👏
They now have a 2⃣-1⃣ lead in the #AUSvIND T20I series with 1⃣ match to play. 🙌
Scorecard ▶ https://t.co/OYJNZ57GLX pic.twitter.com/QLh2SRqW9U
