
కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. 90 అసెంబ్లీ, 400 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైందని చెప్పారు. ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నెలలో తెలంగాణలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్టా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ బహిరంగ సభలోనే కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ ను విడుదల చేస్తామని వెల్లడించారు.
ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామని వెల్లడించారు. గతంలో గెలవని 160 పార్లమెంట్ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న నెల రోజుల్లో గ్రామ స్థాయిలో పది వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మూడు నెలల కాలంలో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయిలో మీటింగ్స్ ఉంటాయని, జనవరి 20నుంచి ప్రజా గోస.. బీజేపీ భరోసా కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామని చెప్పారు.
సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటోందన్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ అన్నారు. కేంద్రం పంచాయతీలకు ఇస్తోన్న నిధులను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ సర్పంచ్ లే చెప్తున్నారన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలవటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.
తన మాతృమూర్తి హీరాబెన్ పెంపకంతోనే ప్రధాని నరేంద్ర మోడీ కర్మయోగీగా మారారని, బాల్యంలో తన తల్లి కష్టాలు చూసి మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన గొప్ప నేత మోడీ అని ఎంపీ లక్ష్మణ్ కొనియాడారు.