15న ఖమ్మంకు అమిత్ షా..25న నాగర్ కర్నూల్​కు జేపీ నడ్డా

15న ఖమ్మంకు అమిత్ షా..25న నాగర్ కర్నూల్​కు జేపీ నడ్డా
  •     ‘మహా జన్​ సంపర్క్ అభియాన్’ సభలకు హాజరు
  •     ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో సునీల్ బన్సల్ సమావేశం 
  •     నెలాఖరులో మోడీ స్టేట్ టూర్​కు చాన్స్!

హైదరాబాద్, వెలుగు: ఈనెల 15వ తేదీన ఖమ్మంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 25న నాగర్​కర్నూల్​కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. మహా జన్​ సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు అమిత్ షా చీఫ్ గెస్ట్​గా హాజరుకానున్నారు. అదేవిధంగా, నాగర్​కర్నూల్​లో నిర్వహించే సభకు జేపీ నడ్డా అటెండ్ అవుతున్నారు. మోడీ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ పాలనను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నెల రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేసింది. నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాష్ట్ర పర్యటనకొచ్చే అవకాశం ఉంది. నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి.. మల్కాజ్​గిరిలో రోడ్​షో ఏర్పాటు చేయాలనుకుంటున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్ రెడీ చేసి పీఎంవో ఆమోదం కోసం స్టేట్ పార్టీ పంపింది. అమిత్ షా, నడ్డా ప్రోగ్రామ్స్​పై బీజేపీ స్టేట్ ఆఫీస్​లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, మహా జన్ సంపర్క్ అభియాన్ టీమ్​తో రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఈ సభల సక్సెస్, జన సమీకరణపై నేతలకు బన్సల్ దిశానిర్దేశం చేశారు.

గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరాలి : బన్సల్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరాలనే లక్ష్యంతో కేడర్ ముందుకెళ్లాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టేట్ ఇన్​చార్జ్ సునీల్ బన్సల్ సూచించారు. బీజేపీ సిటీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే విషయం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ప్రతి రోజూ లీడర్లంతా జనం మధ్యలోనే ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ సూచన మేరకు పనిచేసి గెలుపు కోసం కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, రాష్ట్ర నాయకుడు పాపారావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇన్​చార్జ్​ గోలి మధుసూదన్ రెడ్డి, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, గద్వాల జిల్లా ఇన్​చార్జ్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత మదాపూర్​లోని ఓ హోటల్ లో సోషల్ మీడియా టీమ్​తో సునీల్ బన్సల్ సమావేశం అయ్యారు. మహా జన్ సంపర్క్​ అభియాన్ ప్రోగ్రామ్ సక్సెస్, ముగ్గురు అగ్ర నేతల స్టేట్ టూర్​ను జనంలోకి పాజిటివ్ గా ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు.