ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తం : అమిత్ షా

 ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తం   :  అమిత్ షా

కేసీఆర్‌ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆరోపించారు.  మక్తల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో  ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్  మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలకు అడ్డు లేకుండా పోయిందన్నారు.  ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విధానమన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదన్న అమిత్ షా.. మక్తల్‌లో వంద పడకల ఆసుపత్రి ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.  

బీజేపీ అధికారంలోకి వస్తే మక్తల్‌, నారాయణపేటలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.  మత్స్యకారుల కోసం నిధులు, ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని ప్రజలకు సూచించారు. ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్న అమిత్ షా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా చెప్పుకొచ్చారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ తమ వారసుల గురించే ఆలోచిస్తాయన్నారు అమిత్ షా.. ఢిల్లీలో రాహుల్ గాంధీని, రాష్ట్రంలో కేటీఆర్​ను పదవిలో కూర్చోబెట్టాలని చూస్తున్నాయని చెప్పారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. వారు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే చేరుతారని అమిత్ షా ఆరోపించారు.