
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఆదివారం రాష్ట్రంలోని మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లలో ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్లలో పాల్గొనాల్సి ఉంది. ఈ మీటింగ్ ల సక్సెస్ కోసం ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
అయితే బిహార్ లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో ఢిల్లీలో అమిత్ షా బిజీగా ఉన్నారు. దీంతో అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా పడినట్లు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ నేతలకు సమాచారం అందింది. చివరి క్షణంలో కేంద్ర హోం మంత్రి రాష్ట్ర పర్యటన వాయిదా పడడంతో రాష్ట్ర బీజేపీ క్యాడర్ నిరాశకు గురైంది. అమిత్ షా రాష్ట్ర టూర్ త్వరలోనే ఉంటుందని, కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టం చేశారు.