
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అయోధ్యలో స్థలం కొన్నట్లు తెలుస్తోంది. ముంబయికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అయోధ్యలో అభివృద్ధి చేసిన వెంచర్‌లో బిగ్ బీ స్థలాన్ని కొనుగోలు చేశారట. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ.14.5కోట్లు ఉంటుందని సమాచారం.
ఈ స్థలం భవ్య రామమందిరానికి దగ్గర్లోనే అని తెలుస్తోంది. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజే 51 ఎకరాల్లో సరయూ నది వద్ద ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఓ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి అమితాబ్ గతంలో మాట్లాడుతూ.. ‘అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో నేను ఇల్లు నిర్మించుకోవడం కోసం ఎదురుచూస్తున్నా. ఈ నగరం ఎంతో గొప్ప విశిష్టతను కలిగి ఉంది’ అని పేర్కొన్నారు.