Virat Kohli: కెరీర్ మొత్తం ఒకే ఫ్రాంచైజీకి ఆడాడు.. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో కోహ్లీపై అమితాబ్ ప్రశంసలు

Virat Kohli: కెరీర్ మొత్తం ఒకే ఫ్రాంచైజీకి ఆడాడు.. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో కోహ్లీపై అమితాబ్ ప్రశంసలు

హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 17 వ సీజన్ గ్రాండ్ గా దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా ఒక క్రికెట్ లో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ప్రశ్న అమితాబ్ కంటెస్టెంట్ ను అడిగారు. ఒక ఫ్రాంచైజీ తరపున ఆడి 9000 టీ20 పరుగులను పూర్తి చేసుకున్న ఏకైక ప్లేయర్ ఎవరని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం విరాట్ కోహ్లీ. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున కోహ్లీ 18 సీజన్ ల పాటు ఆడి ఐపీఎల్ 2025 లో ఒకే ఫ్రాంచైజీకి 9000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ ప్రశ్న తర్వాత హోస్ట్ అమితాబ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. 

అమితాబ్ కోహ్లీ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. " అతను తన కెరీర్ మొత్తాన్ని ఆర్సీబీ కోసమే ఆడాడు. 17 సీజన్ లుగా టైటిల్ గెలవలేదు. చివరకు అతను ట్రోఫీ గెలిచినప్పుడు ఆ క్షణాలను మీరు తప్పక చూసే ఉంటారు. ఆ సమయంలో ఆ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యాడు. చాలా సంవత్సరాలుగా జట్టు కోసం కష్టపడిన క్రికెటర్ గురించి మాట్లాడుతున్నాను. ఆ గొప్ప క్రికెటర్ ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు". అని కోహ్లీ గురించి అమితాబ్ ఈ షో లో గొప్పగా మాట్లాడారు. బచ్చన్ మాటలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ పై విరాట్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
 
ఐపీఎల్ 2025 టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌ వేదికగా  పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మెగా ఫైనల్లో గెలిచి ఆర్సీబీ తమ ఐపీఎల్ ట్రోఫీ కలను నెరవేర్చుకున్నారు. 18 సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ వస్తున్న విరాట్ కోహ్లీ ఈ టైటిల్ ఎంతగానో ఎమోషనల్ కు గురి చేసింది.