సంఖ్యా బలం ఉంటే ఇప్పుడైనా గవర్నర్‌ను కలవొచ్చు

సంఖ్యా బలం ఉంటే ఇప్పుడైనా గవర్నర్‌ను కలవొచ్చు
  • మహారాష్ట్రపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్

న్యూఢిల్లీ: దాదాపు 18 రోజులు గడిచిపోయినా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతోనే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయంతో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు. మహారాష్ట్ర ఇష్యూపై ఇవాళ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజుకైనా తమకు సంఖ్యా బలం ఉందని భావిస్తే గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యరీని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరవచ్చని అమిత్ షా తెలిపారు. గతంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు 18 రోజుల సమయం ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారాయన. అసెంబ్లీ గడువు ముగిసిన తర్వాతే గవర్నర్ పార్టీలకు ఆహ్వానం పంపారన్నారు. ఏ ఒక్క పార్టీ హక్కునూ ఆయన కాలరాయలేదన్నారు. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఏ ఒక్క పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పలేకపోయాయని అన్నారు. తమ హక్కుకు భంగం కలిగిందంటూ కపిల్ సిబాల్ లాంటి ఓ పెద్ద లాయర్ వచ్చి చిన్న పిల్లల్లా వాదించడం హాస్యాస్పదంగా ఉందని షా కామెంట్ చేశారు.

శివసేనతో బీజేపీ బంధం బ్రేక్‌పై…

శివసేనతో బీజేపీ పొత్తు బ్రేక్ కావడం పైనా కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. తమ అలయన్స్ గెలిస్తే సీఎం కాబోయేది దేవేంద్ర ఫడ్నవిస్ అని ఎన్నికల ముందు అన్ని సభల్లోనూ తాను, ప్రధాని మోడీ చెప్పామని గుర్తు చేశారాయన. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. ఫలితాలు వచ్చాక వాళ్లు (శివసేన నేతలు) కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారని చెప్పారు అమిత్ షా. ఆ డిమాండ్లేవీ తమకు ఆమోదయోగ్యంగా అనిపించలేదని అన్నారు. పైగా కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలని శివసన పార్టీనే నిర్ణయించుకుందని చెప్పారు.