ఉద్ధవ్ మీరు చూసే కోణాన్ని మార్చుకోండి : అమిత్ షా

ఉద్ధవ్ మీరు చూసే కోణాన్ని మార్చుకోండి : అమిత్ షా

శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగానే ఉంటుందని.. ఆ విషయం తెలియకుండా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గతంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందాన్ని కావాలనే శివసేన విస్మరించిందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. గతంలో శివసేన పార్టీకి సంబందించి ఉన్న విల్లు, బాణం గుర్తును శివసేన రెబల్ వర్గానికి చెందిన సీఎం షిండే వర్గానికి కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ హింసకు ప్రతీక అని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానమంత్రి మోడీకి దాసోహమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. 

ఉద్ధవ్ ఠాక్రే కామెంట్స్ పై అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యతిరేక భావజాలం ఉన్నవారికి ప్రపంచమంతా వ్యతిరేకంగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. సైద్ధాంతికి పునాదుల మీదుగా బీజేపీ పనిచేస్తోందన్నారు. అన్నింటిని పరిశీలించిన తర్వాతే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని అమిత్ షా స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు సీఎం ప‌ద‌విని పంచుకోవ‌డంపై ఎటువంటి ఒప్పందం లేద‌ని అమిత్ షా వ్యాఖ్యానించారు.