సంతకం చేసేలా..బస్సు బోర్డు చదివేలా.. కామారెడ్డి జిల్లాలో ‘అమ్మకు అక్షరాభ్యాసం’ ప్రారంభం

సంతకం చేసేలా..బస్సు బోర్డు చదివేలా..  కామారెడ్డి జిల్లాలో ‘అమ్మకు అక్షరాభ్యాసం’ ప్రారంభం
  • మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం 
  • ఉమ్మడి జిల్లాలో చదువురాని స్వయం సహాయక సభ్యులు 1,01,808 మంది

కామారెడ్డి, వెలుగు : చదువురాని మహిళలు సంతకం చేసేలా, బస్సు బోర్డు చదివేలా అక్షరాలు నేర్పించేందుకు ప్రభుత్వం ‘అమ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమాన్ని చేపట్టింది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చదువు రాని మహిళా సంఘాల సభ్యులు 1,01,808 మంది ఉన్నట్లు తేలింది. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఉల్లాస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 15 ఏండ్లు పైబడిన నిరక్షరాస్యులకు చదవటం, రాయటం నేర్పిస్తారు. వేలి ముద్ర కాకుండా సంతకం చేయటం,  ఏ ఊరికైనా వెళ్తున్నప్పుడు బస్సు బోర్డు చదివేలా అక్షరాలు నేర్పిస్తున్నారు.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం  40,990 సంఘాలు ఉండగా, ఇందులో 4,22,934 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో మొత్తం 1,01,808 మందికి చదువురాదు.  ప్రాథమిక విద్యాభ్యాసం చేసి మధ్యలో చదువు ఆపేసిన వారిని ఓపెన్​ స్కూల్​ విధానం ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదివించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

అక్షరాలు దిద్దించటం ఇలా.. 

మహిళా సంఘాల్లో చదువుకున్న సభ్యులను వలంటీర్లుగా నియమిస్తారు.  వీరు చదువు రాని వారికి కనీసం చదవటం, రాయటం నేర్పించాలి. 3 నెలల కార్యక్రమంలో భాగంగా మొత్తం 200 గంటల పాటు తీసుకోనున్నారు. రోజుకు  కనీసం 2 గంటల పాటు బోధించాలి. ఇందుకోసం బుక్స్​ 
రానున్నాయి.  

అమ్మకు అక్షరాభ్యాసం పేరిట.. 

సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా మిగతా జిల్లాల కంటే ముందే కామారెడ్డి జిల్లాలో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశాలతో అమ్మకు అక్షరాభ్యాసం పేరిట జూన్ 13న  గాంధారి మండలం పోతంగల్​ కుర్దులో వయోజన విద్య విభాగానికి సంబంధించి అధికారులు  ప్రారంభించారు.   జిల్లావ్యాప్తంగా వారం, పది రోజుల్లో పూర్తి స్థాయిలో  వయోజనులకు చదువు చెప్పే కార్యక్రమం ప్రారంభం కానుంది. 

సులభంగా నేర్పించేలా చర్యలు

సులభంగా అక్షరాలు నేర్పిస్తాం.  మహిళా సంఘాల్లో చదువుకున్న సభ్యులు చదువురాని వారికి అక్షరాలు నేర్పిస్తారు.  ఇప్పటికే చదువురాని వారి వివరాలు సేకరించటం జరిగింది. వలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. సంపూర్ణ అక్షరాస్యత సాధించటమే కార్యక్రమం ఉద్దేశం.  - వెంకటేశ్వర్​రావు, వయోజన విద్య అధికారి 

జిల్లా    మొత్తం    మొత్తం    చదువురాని
    సంఘాలు    సభ్యులు    సభ్యుల సంఖ్య
కామారెడ్డి    17,194    1,68,‌‌‌‌‌‌‌‌039    42,749
నిజామాబాద్    23.796    2,54,865    59,059