గుడిలో అమ్మవారి ఆభరణాలు చోరీ

గుడిలో అమ్మవారి ఆభరణాలు చోరీ
  •     విలువ రూ.67 వేలు 
  •     హనుమకొండ జిల్లా పెద్దపెండ్యాలలో ఘటన  

ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. రూ. 67,400 విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన పిట్టల అశోక్ పెద్దమ్మ తల్లి గుడి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు. ఇతడే రోజూ గుడిని శుభ్రం చేస్తుంటాడు. మంగళవారం రాత్రి కూడా గుడిని శుభ్రం చేసి ఇంటికి వెళ్లాడు. 

మర్నాడు ఉదయం కమిటీ సభ్యుడైన పిట్టల వెంకటేశ్వర్లు.. అశోక్ దగ్గర తాళం తీసుకొని గుడికి వెళ్లాడు.అప్పటికే గుడి ఇనుప గేటు తాళం పగలగొట్టి ఉంది. విషయాన్ని అశోక్ కు చెప్పగా అతడు వచ్చి గుడి లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి మెడలోని బంగారు పుస్తెలు, ముక్కుపుడక, వెండి మట్టెలు మాయమయ్యాయి. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాజీపేట ఏసీ పీ తిరుమల్, ధర్మసాగర్ సీఐ ​మహేందర్ సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు.