ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా
  • నిరుపేదలకు ఇండ్లు దక్కేలా అన్ని పార్టీలు సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ 

భీమదేవరపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నాయకులు, అధికారులు వసూళ్లకు పాల్పడితే తానే స్వయంగా ఫిర్యాదు చేసి క్రిమినల్  కేసులు పెట్టిస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్  హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు దక్కేలా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం తన బర్త్​ డే సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, హోమం నిర్వహించారు. అనంతరం కార్యకర్తల నడుమ కేక్  కట్  చేసి సంబరాలు చేసుకున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్  పాలనలో చిగురుమామిడి మండలం ముల్కనూరులో డబుల్  ఇండ్లు  ఇస్తామని చెప్పడంతో కొంత మంది పాత ఇండ్లను కూలగొట్టుకున్నారని, ఆ తరువాత పట్టించుకోకపోవడంతో  ప్రజలు హెచ్ఆర్సీని ఆశ్రయించి 243  ఇండ్లు సాధించుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో హుస్నాబాద్ ను రోల్​ మోడల్​గా తీర్చిదిద్దాలనే  సంకల్పంతో ముందుకెళ్తున్నానని, నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇండ్లు  మంజూరు చేసినట్లు తెలిపారు.

 గ్రామాలు, బూత్​ లెవల్​లో జనాభాను బట్టి ఇండ్ల కేటాయింపు జరిగిందన్నారు. నిరుపేదలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుడి పేరును సంబంధిత గ్రామ పంచాయతీల వద్ద నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. ఇండ్లు రాని వారెవరూ  నిరుత్సాహ పడవద్దని, రెండు నెలల్లో మరో 3,500 ఇండ్లు  మంజూరు అవుతాయని చెప్పారు. ఏటా ఇండ్లు మంజూరు చేస్తూ అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. కాంగ్రెస్  నేతలు చిట్టెంపల్లి ఐలయ్య, స్వరూప పాల్గొన్నారు.