
ఫ్లోరోసిస్ బాధితుడు, ఫ్లోరైడ్పై పోరాటం చేసిన ఉద్యమకారుడు అంశాల స్వామి కన్నుమూశాడు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెం కు చెందిన స్వామి..ప్రమాదవశాత్తు బైక్ నుంచి కింద పడటంతో ఆయన ఇవాళ మృతి చెందాడు. కాగా, స్వామి చాలా ఏళ్ళు ఫ్లోరోసిస్ సమస్యపై స్వామి ఉద్యమం చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడి అనుకున్న ఆశయం నెరవేర్చాడు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ స్వామి కీలక పాత్ర పోషించాడు. ఎన్నో సమావేశాల్లో సీఎం కేసీఆర్ కూడా అంశాల స్వామి పేరు ప్రస్తావనకు తెచ్చేవారు. స్వామి మృతి పట్ల మంత్రులు కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంతాపం తెలిపారు.
స్వామి మరణ వార్త విన్న మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి మృతిపై ఆయన ఆయన స్పందించారు. స్వామి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వామి ఫ్లోరోసిస్ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. ఎంతో మందికి ఆయన ఆదర్శమన్నారు. స్వామి ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటాడని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కేటీఆర్ తెలిపారు. ఇటీవలే స్వామి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన మంత్రి కేటీఆర్, స్వామికి ఆప్యాయంగా అన్నం వడ్డించారు. స్వామికి ఇల్లు కట్టించి ఔద్దార్యం చాటుకున్నాడు.